మెస్సీ, పీలే
మాడ్రిడ్: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయనెల్ మెస్సీ మరో మైలురాయిని చేరుకున్నాడు. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే నెలకొల్పిన ఆల్‌టైమ్ క్లబ్ గోల్స్ రికార్డును సమం చేశాడు. బార్సిలోనా క్లబ్ తరఫున బరిలోకి దిగిన మెస్సీ స్పెయిన్ లీగ్ లా లిగా టోర్నీలో భాగంగా వాలెన్సియాతో జరిగిన మ్యాచ్‌లో గోల్ చేశాడు. దీంతో పీలే పేరిట ఉన్న 643 గోల్స్ రికార్డును మెస్సీ సమం చేశాడు. పీలే 1957 నుంచి 1974 వరకు సాంటోస్ క్లబ్‌కు ఆడి ఈ రికార్డు గోల్స్ చేశాడు. కాగా మెస్సీ 2004లో బార్సిలోనా జట్టులో చేరాడు. అప్పటి నుంచి విశేషంగా రాణిస్తున్న మెస్సీ తాజాగా పీలే మైలురాయిని చేరుకున్నాడు.
స్పానిష్ లీగ్‌లోనే యూరోప్‌లో జరిగే టోర్నీల్లో కూడా మెస్సీ ప్రదర్శన నిలకడగా ఉంటుంది. 2018లో 366వ గోల్‌తో యూరోప్‌లోని మేటి లీగ్‌లలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా ఘనత వహించాడు. ఈ క్రమంలో గెర్డ్ ముల్లర్ (జర్మనీ–365 గోల్స్) రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ముల్లర్ పేరిట ఉన్న మరో రికార్డును మెస్సీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక గోల్స్ చేసిన ముల్లర్ (86 గోల్స్) రికార్డు కూడా ఇప్పుడు మెస్సీ పేరిటే ఉంది. 2012లో మెస్సీ 91 గోల్స్‌తో ముల్లర్ రికార్డును అధిగమించాడు. తన గోల్స్ మార్కును చేరుకొని తన సరసన నిలిచిన మెస్సీని బ్రెజిల్ జగది్వఖ్యాత పీలే అభినందనలతో ముంచెత్తాడు.
Comments
Please login to add a commentAdd a comment