England Remain Unchanged For Fifth Ashes Test: యాషెస్ సిరీస్-2023లో ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఓవల్ వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో మాంచెస్టర్‌లో ఆడిన జట్టునే కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలిపింది.
కాగా నాలుగో టెస్టులో విఫలమైన వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌పై విమర్శల నేపథ్యంలో.. ఆఖరి మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ అతడికి అవకాశం ఇవ్వడం విశేషం. కాగా లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో అండర్సన్ మిస్ అయ్యాడు. ఈ క్రమంలో మాంచెస్టర్‌లో అతడికి ఛాన్స్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు.
వైఫల్యాలు కొనసాగిస్తూ
గత వైఫల్యాలను కొనసాగిస్తూ కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లో మొత్తంగా 114 ఓవర్లు వేసిన అండర్సన్ కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 1000 వికెట్ల(ఫస్ట్‌క్లాస్)తో లెజెండరీ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న అతడు.. తాజా యాషెస్ సిరీస్‌లో మాత్రం జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వంటి వాళ్లు ఘాటు విమర్శలు చేశారు. దీంతో.. ఆఖరి టెస్టులో అండర్సన్ ఆడిస్తారా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అతడిని కొనసాగిస్తున్నట్లు మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. దీంతో ఇంత మొండితనం పనికిరాదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
2-1తో ఆధిక్యంలో ఆస్ట్రేలియా
అండర్సన్‌కు బదులు ఓలీ రాబిన్సన్, జోస్ టంగ్‌లలో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కాగా జూలై 27 నుంచి ఇంగ్లండ్- ఆసీస్ మధ్య ఐదో టెస్టు ఆరంభం కానుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో.. 2-1తో ఆధిక్యంలో ఉన్న కమిన్స్ బృందంపై ఇంగ్లండ్ పైచేయి సాధిస్తుందా లేదా వేచి చూడాలి!!
యాషెస్ 2023- ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు:
బెన్ డకెట్, జాక్ క్రాలీ, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.
చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్‌స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా..
Comments
Please login to add a commentAdd a comment