5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్‌ వెల్లలగే? | Asia Cup 2023, Ind vs SL: Who Is Dunith Wellalage, The Spinner Rattled India Top Order | Sakshi
Sakshi News home page

‘శ్రీలంక టీమిండియాను కుప్పకూల్చింది’!.. 5 వికెట్లే కాదు.. సెంచరీ హీరో కూడా! టాప్‌ స్కోరర్‌గా..

Published Wed, Sep 13 2023 10:16 AM | Last Updated on Wed, Sep 13 2023 11:00 AM

Asia Cup 2023 Ind vs SL: Who Is Dunith Wellalage Rattled India Top Order - Sakshi

Asia Cup 2023- India vs Sri Lanka- Who Is Dunith Wellalage: ‘‘శ్రీలంక టీమిండియాను కుప్పకూల్చింది’’.. ఆసియా కప్‌-2023 సూపర్‌-4 మ్యాచ్‌లో పటిష్ట టీమిండియా టాప్-5 బ్యాటర్లలో నలుగురిని లంక కుర్ర స్పిన్నర్‌ పెవిలియన్‌కు పంపిన క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ డొమినిక్‌ కార్క్‌ చేసిన వ్యాఖ్య ఇది.

మ్యాచ్‌ చూస్తున్న ప్రతి క్రికెట్‌ అభిమాని ఇలాగే ఫీలై ఉంటారనడంలో సందేహం లేదు. తొలుత ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌(19)ను బౌల్డ్‌ చేసి.. ఆ తర్వాత వెంటనే రన్‌మెషీన్‌, గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని అవుట్‌ చేసిన సదరు బౌలర్‌ పేరు..

దునిత్‌ వెల్లలగే.. 20 ఏళ్ల లెఫ్టార్మ్‌ ఆర్థోడాక్స్‌ అతడి బౌలింగ్‌ స్టైల్‌. జనవరి 9, 2003లో కొలంబోలో జన్మించాడు ఈ కుర్రాడు. గతేడాది వెస్టిండీస్‌లో జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌లో శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 

ఈ ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియా, స్కాట్లాండ్‌లతో మ్యాచ్‌లలో 5 వికెట్ల ఘనత సాధించిన ఈ శ్రీలంక చిన్నోడు.. ప్రపంచకప్‌ టాప్‌ పెర్ఫార్మర్స్‌లో ఒకడిగా నిలిచాడు. వన్డే ఈవెంట్లో మొత్తంగా 17 వికెట్లు పడగొట్టాడు. 

టాప్‌ స్కోరర్‌ కూడా అతడే
అదే విధంగా.. 264 పరుగులతో సత్తా చాటిన ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ శ్రీలంక తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌గానూ నిలిచాడు. కీలక సమయాల్లో జట్టుకు విజయాన్ని అందించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న వెల్లలగే.. ఆస్ట్రేలియా మీద కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

సౌతాఫ్రికాపై సెంచరీ
ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు.. 71 బంతుల్లో 52 పరుగులు సాధించి శ్రీలంకను విజేతగా నిలిపాడు. అయితే, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో మెరిశాడు వెల్లలగే. 130 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 113 పరుగులు సాధించాడు. 

అరంగేట్రంలో దిగ్గజ బ్యాటర్‌ వికెట్‌ తీసి
అంతేకాదు.. ప్రొటిస్‌ యువ జట్టుతో మ్యాచ్‌లో ఒక వికెట్‌ కూడా పడగొట్టాడు. అద్భుత ప్రదర్శనతో శ్రీలంకకు 65 పరుగుల తేడాతో విజయం అందించాడు. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ప్లేయర్‌గా, కెప్టెన్‌గా రాణించిన దునిత్‌ వెల్లలగే.. గతేడాది ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

అదే ఏడాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. వన్డేలో అరంగేట్రంలోనే స్టీవ్‌ స్మిత్‌ వంటి దిగ్గజ బ్యాటర్‌ను అవుట్‌ చేసిన వెల్లలగే.. మొత్తంగా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పటి వరకు ఆడిన ఒకే ఒక టెస్టులో ఒక్క వికెట్‌ కూడా తీయకపోయినప్పటికీ మెరుగ్గా బౌలింగ్‌ చేశాడు. ఈ క్రమంలో.. శ్రీలంక వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ జట్టులో స్టాండ్‌ బైగా చోటు సంపాదించాడు.

టీమిండియాపై సంచలన ప్రదర్శనతో
అదే విధంగా ఆసియా కప్‌-2023 జట్టుకు ఎంపికైన వెల్లలగే.. టీమిండియాపై సంచలన ప్రదర్శనతో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారాడు. తన కెరీర్‌లో గుర్తుండిపోయే విధంగా.. టీమిండియాతో మ్యాచ్‌లో 5 వికెట్లతో అదరగొట్టాడు. గిల్‌, కోహ్లిలను పెవిలియన్‌కు పంపడంతో.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా రూపంలో టాప్‌ బ్యాటర్ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

పిన్న వయస్కుడిగా చరిత్ర
తద్వారా.. లంక తరఫున ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు వెల్లలగే. కొలంబోలో ఆకాశమే హద్దుగా చెలరేగి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే లంకతో మ్యాచ్‌లో 41 పరుగులతో గెలుపొందిన భారత జట్టు ఆసియా వన్డే కప్‌-2023 ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. 

చదవండి: Ind Vs SL: ప్రతి బంతికి వికెట్‌ తీయాలనుకుంటాడు.. అతడు అద్భుతం: రోహిత్‌
కుంబ్లేకు సాధ్యం కాలేదు.. కుల్దీప్‌ యాదవ్‌ సరికొత్త చరిత్ర!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement