ప్రచండులైన పాక్‌ బౌలర్లతోనే కాలేదు.. ఈ కుర్రాడు టీమిండియాను కకావికలం చేశాడు..! | Asia Cup 2023, India Vs Sri Lanka: Sri Lanka Spinner Dunith Wellalage Troubles Team India In Super 4 Clash - Sakshi
Sakshi News home page

Asia Cup 2023 IND VS SL: ప్రచండులైన పాక్‌ బౌలర్లతోనే కాలేదు.. ఈ కుర్రాడు టీమిండియాను కకావికలం చేశాడు..!

Published Tue, Sep 12 2023 6:08 PM | Last Updated on Tue, Sep 12 2023 6:33 PM

Asia Cup 2023: Lanka Spinner Dunith Wellalage Troubles Team India In Super 4 Clash - Sakshi

ఆసియా కప్‌-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 12) జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంక యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే చెలరేగిపోయాడు. కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించి సత్తా చాటాడు. ఈ అనామక బౌలర్‌ టీమిండియా టాపార్డర్‌ను కకావికలం చేసి, జట్టు భారీ స్కోర్‌ సాధించకుండా నియంత్రించాడు. పట్టుమని 15 మ్యాచ్‌లు కూడా ఆడని 20 ఏళ్ల వెల్లలగేను ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. స్లో ట్రాక్‌పై లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌ అయిన వెల్లలగే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఇతను సంధించిన బంతులకు సమాధానం లేక విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ లాంటి వారే చేతులెత్తేశారు. యువ కెరటం శుభ్‌మన్‌ గిల్‌, స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా కూడా వెల్లలగే మాయాజాలానికి చిక్కి వికెట్లు సమర్పించుకున్నారు. వీరిలో రోహిత్‌, గిల్‌ క్లీన్‌బౌల్డ్‌లు కాగా.. కోహ్లి షనకకు, హార్దిక్‌ కుశాల్‌ మెండిస్‌కు క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టారు. కేఎల్‌ రాహుల్‌ను అయితే వెల్లలగేనే క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు. బ్యాటింగ్‌ హేమహేమీలైన రోహిత్‌, గిల్‌, విరాట్‌, రాహుల్‌, హార్దిక్‌లను అంతుచిక్కని బంతులు వేసి ఔట్‌ చేసిన వెల్లలగేపై ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో ప్రశంసల వర్షం కురుస్తుంది.

లంక క్రికెట్‌కు మరో మిస్టరీ స్పిన్నర్‌ దొరికాడని నెట్టింట కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. దుర్భేద్యమైన భారత టాపార్డర్‌ను నియంత్రించడం ప్రచండులైన పాక్‌ బౌలర్ల వల్లనే కాలేదు, 20 ఏళ్ల కుర్రాడు భారత టాపార్డర్‌కు ముచ్చెమటలు పట్టించాడని కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తాని​ని వెల్లలగే మాయలో పడి టీమిండియా నామమాత్రపు స్కోర్‌ చేసేందుకు కూడా అష్టకష్టాలు పడుతుంది.

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌.. దునిత్‌ వెల్లలగే (10-1-40-5) మాయాజాలం ధాటి​కి 41 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. వెల్లలగేకు తోడుగా చరిత్‌ అసలంక (6-0-14-2) కూడా రాణించడంతో భారత్‌ 200 పరుగుల మార్కును చేరేందుకు కూడా చమటోడుస్తుంది. రోహిత్‌ శర్మ (53) ఒక్కడే హాఫ్‌ సెంచరీతో పర్వాలేదనిపించగా.. ఇషాన్‌ కిషన్‌ (33), కేఎల్‌ రాహుల్‌ (39) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. శుభ్‌మన్‌ గిల్‌ (19), విరాట్‌ కోహ్లి (3), హార్దిక్‌ (5), జడేజా (4) నిరాశపరిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement