Asia Cup 2023: Pakistan Cricket Board React On BCCI Secretary Jay Shah Statement, Surprise And Disappointment - Sakshi
Sakshi News home page

Asia Cup 2023 Venue: జై షా వ్యాఖ్యలపై పీసీబీ స్పందన.. ఏకపక్షంగా! ఆశ్చర్యకరంగా..

Published Wed, Oct 19 2022 3:58 PM | Last Updated on Wed, Oct 19 2022 4:58 PM

Asia Cup 2023: PCB On Jay Shah Statement Surprised Disappointed - Sakshi

ఆసియా కప్‌-2022లో తలపడ్డ భారత్‌- పాకిస్తాన్‌

Asia Cup 2023- BCCI Jay Shah- PCB: ‘‘ఆసియా కప్‌-2023 టోర్నీ నిర్వహణను తటస్థ వేదికకు మార్చనున్నామంటూ ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలు పీసీబీని ఆశ్చర్యపరిచాయి. నిరాశకు గురిచేశాయి. ఏసీసీలోని సభ్యులతో గానీ.. ఆతిథ్య దేశ బోర్డుతో గానీ చర్చించకుండానే ఇలాంటి ప్రకటనలు చేయడం దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి’’ అని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు స్పందించింది. కాగా ముంబైలో జరిగిన 91వ సర్వసభ్య సమావేశం అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ.. ఆసియా కప్‌ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తటస్థ వేదికపైనే ఆసియా కప్‌-2023ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నాడు.

తీవ్ర నిరాశకు లోనయ్యాం
ఈ ప్రకటనపై తాజాగా స్పందించిన పీసీబీ.. ‘‘ఏసీసీ బోర్డు, సభ్యుల సహకారంతో ఆసియా కప్‌ నిర్వహించేందుకు పాక్‌ సిద్ధమైంది. ఎంతో సంతోషించింది. కానీ.. షా మాత్రం ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. 1983, సెప్టెంబరులో రూపుదిద్దుకున్న ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నిబంధనల స్ఫూర్తికి ఆయన ప్రకటన విరుద్ధంగా ఉంది. 

ఆసియా క్రికెట్‌ మండలి సభ్య దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా.. ఆసియా ఖండంలో క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ఏర్పడింది. కానీ ఇలాంటి ప్రకటనలు ఆసియా క్రికెట్‌ దేశాల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయి. 

తీవ్ర ప్రభావం చూపుతుంది
ముఖ్యంగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 నేపథ్యంలో పాకిస్తాన్‌.. ఇండియా పర్యటన.. అదే విధంగా 2024-2031 సైకిల్‌కు సంబంధించిన ఐసీసీ ఈవెంట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏసీసీ ప్రెసిడెంట్‌ వ్యాఖ్యలకు సంబంధించి పీసీబీకి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఈ విషయంలో ఏసీసీ జోక్యం చేసుకుని.. సున్నితమైన ఈ అంశం గురించి చర్చించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని తన ప్రకటనలో పేర్కొంది.

కాగా ఆసియా కప్‌-2023 పాక్‌లో నిర్వహించాల్సి ఉండగా.. వన్డే వరల్డ్‌కప్‌-2023కు భారత్‌ వేదిక కానున్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఏసీసీ, ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే దాయాదులు పోటీపడుతున్నాయి.

చదవండి: Ind Vs Pak: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌ మాజీ కోచ్‌ ఘాటు వ్యాఖ్యలు.. పొట్టలు వేలాడేసుకుని, ఒళ్లు సహకరించక
T20 World Cup 2022: ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ సహా ఆ మ్యాచ్‌లన్నీ వర్షార్పణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement