Asia Cup 2023: కేఎల్‌ రాహుల్‌ ఔట్.. పాక్‌తో కీలక మ్యాచ్‌.. తుది జట్టులో ఎవరు..? | Asia Cup 2023: Predicted Team India For Pakistan Match - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: కేఎల్‌ రాహుల్‌ ఔట్.. పాక్‌తో కీలక మ్యాచ్‌.. తుది జట్టులో ఎవరు..?

Published Tue, Aug 29 2023 3:45 PM | Last Updated on Tue, Aug 29 2023 3:53 PM

Asia Cup 2023: Predicted Team India For Pakistan Match - Sakshi

ఆసియాకప్‌-2023 ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కేఎల్‌ రాహుల్‌ ఆసియాకప్‌లో టీమిండియా ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు (పాకిస్తాన్‌, నేపాల్‌) దూరమయ్యాడు. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఈ నేపథ్యంలో పాక్‌, నేపాల్‌తో జరిగే మ్యాచ్‌ల్లో రాహుల్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పాక్‌తో మ్యాచ్‌లో రాహుల్‌ రీప్లేస్‌మెంట్‌గా తుది జట్టులో ఎవరుంటారని భారత అభిమానులు చర్చించుకుంటున్నారు. 

రాహుల్‌ ఔటయ్యాక వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ కోటాలో భారత్‌కు రెండు ఆప్షన్స్‌  ఉన్నాయి. ఇషాన్‌ కిషన్‌, ట్రావెలింగ్‌ రిజర్వ్‌ సంజూ శాంసన్‌లలో ఎవరో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరి వీరిలో అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉంటాయన్న విషయాన్ని పరిశీలిస్తే.. రేసులో ఇషాన్‌ కిషన్‌ ముందుంటాడు.

ఇషాన్‌కు అతని ఫామ్‌ (వన్డేల్లో) ప్రధానంగా కలిసొచ్చే అంశం కాగా.. రెండవది అతను లెఫ్ట్‌ హ్యాండర్‌ కావడం​. భారత టాపార్డర్‌ అంతా రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్లే కావడంతో మిడిలార్డర్‌లో లేదా ఓపెనింగ్‌ స్థానంలో ఇషాన్‌ లాంటి అటాకింగ్‌ లెఫ్ట్‌ హ్యాండర్‌ ఉండటం జట్టుకు అదనంగా కలిసొచ్చే అంశంగా మారుతుంది. 

ఒకవేళ మేనేజ్‌మెంట్‌ లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ కాంబినేషన్‌తో ఇన్నింగ్స్‌ ప్రారంభించాలని భావిస్తే.. తుది జట్టులో ఇషాన్‌ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు. పై పేర్కొన్న అంశాలు ఇషాన్‌కు కలిసొచ్చేవి కాగా, ఇటీవలికాలంలో పేలవ ప్రదర్శనలు సంజూ శాంసన్‌కు ప్రతికూల అంశాలుగా చెప్పవచ్చు. ప్రస్తుతమున్న సమీకరణ దృష్ట్యా ఎలా చూసినా, రాహుల్‌కు రీప్లేస్‌మెంట్‌గా ఇషాన్‌ కిషన్‌ తుది జట్టులో ఉంటాడు.  

ఇషాన్‌ ఓపెనర్‌గా వస్తే, ప్రస్తుతం తుది జట్టులో స్థానం కన్ఫర్మ్‌ అనుకున్న వారి స్థానాలు అటుఇటుగా మారతాయి. రోహిత్‌కు జతగా ఇషాన్‌ ఓపెనర్‌గా వస్తే, శుభ్‌మన్‌ గిల్‌ వన్‌డౌన్‌లో, విరాట్‌ కోహ్లి నాలుగో స్థానంలో, శ్రేయస్‌ అయ్యర్‌ ఐదులో, ఆరో స్థానంలో హార్దిక్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా, సిరాజ్‌ ఆతర్వాతి స్థానాల్లో బరిలోకి దిగాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే, ఆసియాకప్‌-2023లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా సెప్టెంబర్‌ 2న భారత్‌-పాక్‌లు తలపడనున్నాయి. అనంతరం ఇదే వేదికపై సెప్టెంబర్‌ 4న నేపాల్‌.. టీమిండియాను ఢీకొంటుంది.

పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా (అంచనా): రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement