వన్డేల్లో ఏకైక బ్యాటర్‌గా రోహిత్‌ రికార్డు.. మరి ఆసియా కప్‌లో? ఈ గణాంకాలు చూస్తే | What is Rohit Sharma's Record in Asia Cup ODI Format? - Sakshi
Sakshi News home page

Rohit Sharma: వన్డేల్లో ఏకైక క్రికెటర్‌గా రోహిత్‌ రికార్డు.. మరి ఆసియా కప్‌ సంగతేంటి? ఈ గణాంకాలు చూస్తే మాత్రం..

Published Sat, Aug 26 2023 3:36 PM | Last Updated on Sat, Aug 26 2023 4:01 PM

Asia Cup 2023: What is Rohit Sharma Record In Asia ODI Format - Sakshi

Rohit Sharma’s record in the Asia Cup ODI Format: ఆసియా టీ20 కప్‌ సందర్భంగా గతేడాది తొలిసారిగా మెగా టోర్నీలో కెప్టెన్‌గా పాల్గొన్నాడు టీమిండియా సారథి రోహిత్‌ శర్మ. అయితే, అనుకున్న స్థాయిలో జట్టు రాణించకపోవడంతో హిట్‌మ్యాన్‌కు నిరాశ తప్పలేదు. తనకు అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్లో ఆటగాడిగానూ, కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు.

కెప్టెన్‌గా విఫలం
టీ20 ఫార్మాట్‌లో నిర్వహించిన టోర్నీలో మొత్తంగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ శర్మ 132 పరుగులు చేయగలిగాడు. అత్యధిక స్కోరు 72. సూపర్‌ ఫోర్‌ దశలో శ్రీలంక మీద హిట్‌మ్యాన్‌ ఈ మేరకు అర్ధ శతకం(41 బంతుల్లో 72 పరుగులు)తో రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

నాటి మ్యాచ్‌లో శ్రీలంక 174 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో టీమిండియాకు నిరాశే మిగిలింది. ఇక ఈసారి ఆసియా కప్‌ను 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్‌, శ్రీలంక వేదికలుగా హైబ్రిడ్‌ విధానంలో టోర్నీ జరుగనుంది.

ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 17 వరకు సాగనున్న ఈ వన్డే ఈవెంట్‌లో టీమిండియా శ్రీలంకలోనే తమ అన్ని మ్యాచ్‌లు ఆడనుంది. మరి.. ఆసియా వన్డే కప్‌లో రోహిత్‌ శర్మ రికార్డులు ఎలా ఉన్నాయంటే?!

డబుల్‌ సెంచరీల వీరుడు
36 ఏళ్ల ఈ ముంబై బ్యాటర్‌ ఇప్పటి వరకు టీమిండియా తరఫున మొత్తంగా 244 వన్డేలు ఆడాడు. స్ట్రైక్‌రేటు 89.97తో సగటున 48.69 రన్స్‌తో 9837 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 48 అర్ధ శతకాలు ఉన్నాయి.

అంతేకాదు 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్‌గానూ రోహిత్‌ కొనసాగుతున్నాడు. 2014, నవంబరులో హిట్‌మ్యాన్‌ శ్రీలంకతో మ్యాచ్‌లో 173 బంతుల్లో 264 పరుగులు సాధించాడు. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో రోహిత్‌ విశ్వరూపం ప్రదర్శించి అభిమానులను తన ఇన్నింగ్స్‌తో కన్నుల విందు చేశాడు.

ఏకైక బ్యాటర్‌గా అరుదైన రికార్డు
అంతేకాదు.. అంతర్జాతీయ వన్డేల్లో మూడుసార్లు 200 పరుగుల మార్కు దాటిన ఏకైక బ్యాటర్‌గానూ రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. 2013లో బెంగళూరు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మీద 209, 2017లో మొహాలీలో శ్రీలంక మీద 208(నాటౌట్‌) డబుల్‌ సెంచరీలతో అదరగొట్టాడు.

మరి ఆసియా కప్‌ సంగతి?
ఇలా వన్డేల్లో అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న రోహిత్‌ శర్మ.. ఆసియా వన్డే కప్‌లో గతంలో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ ఫార్మాట్లో 22 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్‌ మొత్తంగా 745 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది. ఆరు ఫిఫ్టీలు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

అదే అత్యధిక స్కోరు
ఆసియా వన్డే కప్ టోర్నీలో రోహిత్‌ శర్మ అత్యధిక స్కోరు 111 నాటౌట్‌. 2018 ఎడిషన్‌ సందర్భంగా యూఏఈలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దాయాది జట్టుపై అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి 9 వికెట్లు తేడాతో చిరకాల ప్రత్యర్థిని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. 

నాటి మ్యాచ్‌లో రోహిత్‌ శర్మతో పాటు మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(114) కూడా శతకంతో చెలరేగడం విశేషం. ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌ వన్డే ఫార్మాట్లో రోహిత్‌ సాధించిన హాఫ్‌ సెంచరీల లిస్టు చూసేద్దామా?

రోహిత్‌ ఆసియా వన్డే కప్‌ హాఫ్‌ సెంచరీలు
►2018లో ఢాకా మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ మీద 104 బంతుల్లో 83 పరుగులు నాటౌట్‌.
►2010లో డంబుల్లా మ్యాచ్‌లో శ్రీలంక మీద 73 బంతుల్లో 69 పరుగులు
►2012లో మిర్పూర్‌లో పాకిస్తాన్‌ మీద 83 బంతుల్లో 68 పరుగులు

►2008లో కరాచిలో పాకిస్తాన్‌ మీద 58 పరుగులు
►2014లో మిర్పూర్‌లో పాకిస్తాన్‌ మీద 56 పరుగులు
►2018లో దుబాయ్‌లో పాకిస్తాన్‌ మీద 52 పరుగులు. 

 ఆసియా టీ20లలో హిట్‌మ్యాన్‌ రికార్డు
ఆసియా కప్‌ టీ20 ఫార్మాట్లో రోహిత్‌ శర్మ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి 271 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. 2016లో మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌ మీద 55 బంతుల్లో 83 పరుగులు హిట్‌మ్యాన్‌ అత్యధిక స్కోరు. గతేడాది శ్రీలంక మీద 72 పరుగులతో తన ఆసియా కప్‌ టీ20 కెరీర్‌లో రెండో అత్యధిక స్కోరు సాధించాడు రోహిత్‌ శర్మ.

చదవండి: కోహ్లి కాదు! వరల్డ్‌కప్‌ అంటే అతడికి ఊపొస్తుంది.. టాప్‌ స్కోరర్‌ తనే: సెహ్వాగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement