Asia Cup 2023 India Vs Pakistan: ఆసియా కప్-2023 నిర్వహణ అంశంపై సందిగ్దం వీడటం లేదు. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ హక్కులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దక్కించుకున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా క్రికెటర్లను పాక్‌కు పంపించే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జై షా గతంలోనే స్పష్టం చేశారు.
హైబ్రీడ్ మోడల్!
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ సైతం ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పీసీబీ సైతం ఇదే తరహాలో బదులిచ్చింది. దీంతో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని బీసీసీఐ స్పష్టం చేయగా.. టోర్నీ సజావుగా సాగాలంటే కొన్ని మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అస్సలు కుదరదు
ఈ క్రమంలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు ఇతర వేదికలపై నిర్వహించేందుకు వీలుగా రూపొందించిన హైబ్రీడ్ మోడల్‌కు పీసీబీ సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, హైబ్రీడ్ మోడల్ ప్రతిపాదనకు మొదట కాస్త సానుకూలంగానే ఉన్న బీసీసీఐ.. తాజాగా తిరస్కరించినట్లు సమాచారం. టోర్నీ వేదికను పాక్ నుంచి వేరే దేశానికి తరలించాలని పట్టుబట్టినట్లు సమాచారం.
అప్పుడు కూడా సమస్యలు
ఈ నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహణపై శ్రీలంక, యూఏఈ ఆసక్తి కనబరుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ మాత్రం.. తమ దేశంలోనే ఈ మెగా ఈవెంట్ నిర్వహించాలని, ఇప్పుడీ సమస్య పరిష్కారం కాకపోతే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ విషయంలోనూ సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా 2023 వన్డే కప్ అసలు జరుగుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇతర దేశాల అభిప్రాయం కూడా తీసుకుని
కాగా పాక్‌లో ఆసియా కప్ నిర్వహణ అంశంపై జై షా రెండు వారాల క్రితం మాట్లాడుతూ.. ‘‘ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ సహా ఆసియా కప్ 2023 వేదిక అంశంపై టోర్నీలో పాల్గొనే ఇతర దేశాల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు.
ఆసియా కప్ రద్దు చేసి
ఆసియా కప్ నిర్వహణపై పాక్ సమస్యలు సృష్టిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ ఈవెంట్‌ను రద్దు చేసి దాని స్థానంలో ఐదు దేశాలు మాత్రమే పాల్గొనేలా మరో టోర్నీ నిర్వహణకు వీలుగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.
కాగా గతేడాది ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌లతో పాటు హాంగ్ కాంగ్ పోటీపడ్డాయి. ఈ ఈవెంట్‌లో శ్రీలంక ట్రోఫీ కైవసం చేసుకోగా.. పాక్ రన్నరప్‌గా నిలిచింది.
చదవండి: సెంచరీతో చెలరేగాడు.. భారత జట్టులోకి జైశ్వాల్! హింట్ ఇచ్చిన రోహిత్ శర్మ
MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్‌స్టార్.. నో డౌట్!
Comments
Please login to add a commentAdd a comment