ఏంటా బౌలింగ్‌ సామి! సిరాజ్‌ దెబ్బకు లంక విలవిల.. ఆసియా కప్‌ మనదే | Asia Cup Final: Siraj Sensation India Beat Sri Lanka By 10 Wickets | Sakshi
Sakshi News home page

#Mohammed Siraj: వారెవ్వా ఏంటా బౌలింగ్‌ సామి! హైదరాబాదీ దెబ్బకు లంక విలవిల.. ఆసియా కప్‌ మనదే

Published Sun, Sep 17 2023 6:05 PM | Last Updated on Sun, Sep 17 2023 6:40 PM

Asia Cup Final: Siraj Sensation India Beat Sri Lanka By 10 Wickets - Sakshi

Asia Cup 2023 Winner Team India: ఆసియా వన్డే కప్‌-2023 ఫైనల్‌.. టీమిండియా వర్సెస్‌ శ్రీలంక.. ఆదివారం.. అంతర్జాతీయ టైటిల్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానుల ఐదేళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత జట్టు.. సమిష్టితత్వాన్ని నమ్ముకుని రోహిత్‌ సేనను ఢీకొట్టేందుకు దసున్‌ షనక బృందం సిద్ధమయ్యాయి.. 

కొలంబోలో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ సాగే కొద్దీ బంతి టర్న్‌ అయ్యే సూచనలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు లంక కెప్టెన్‌ దసున్‌ టాస్‌ సందర్భంగా తెలిపాడు. రోహిత్‌ శర్మ కూడా తాము కూడా బ్యాటింగ్‌ వైపే మొగ్గు చూపేవాళ్లమని పేర్కొన్నాడు. పైగా ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన మ్యాచ్‌లలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే ఐదుసార్లు గెలుపొందింది.

దీంతో.. అభిమానుల్లో ఆందోళన.. రోహిత్‌ టాస్‌ గెలిస్తే బాగుండు.. ప్చ్‌..  ఇంతలో వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యం.. కాసేపటికి కవర్లు తీయగానే కాస్త ఉత్సాహం.. ఏం జరుగబోతుందో చూద్దాం అనుకుంటుండగా.. టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అటాకింగ్‌ మొదలుపెట్టాడు..

మూడో బంతికే ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా అవుట్‌. వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. బుమ్రా ఇలా శుభారంభం అందించగా.. హైదరాబాదీ స్టార్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

నాలుగో ఓవర్‌ మొదటి బంతికి పాతుమ్‌ నిసాంకను.. మూడో బంతికి సదీర సమరవిక్రమను ఎల్బీడబ్ల్యూగా.. ఆ మరుసటి బాల్‌కే చరిత్‌ అసలంకను అవుట్‌ చేశాడు. అంతటితో సిరాజ్‌ వికెట్ల దాహం తీరలేదు.. ఆఖరి బంతికి ధనుంజయ డిసిల్వను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఒకే ఓవర్లో ఏకంగా.. నాలుగు వికెట్లు.. వన్డే ఫార్మాట్లో అరుదుగా కనిపించే దృశ్యం..

ఇక్కడితో మన స్పీడ్‌స్టర్‌ సిరాజ్‌ జోరు ఆగిపోలేదు.. ఆ తర్వాత ఆరో ఓవర్‌ నాలుగో బంతికి లంక కెప్టెన్‌ దసున్‌ షనకను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేశాడు. తద్వారా 16 బంతుల్లోనే ఐదు వికెట్లు కూల్చిన బౌలర్‌గా ఘనత సాధించాడు.

ఆ తర్వాత మళ్లీ పన్నెండో ఓవర్లో రోహిత్‌ శర్మ మరోసారి సిరాజ్‌కు బంతినివ్వగా.. రెండో బాల్‌కే శ్రీలంక స్టార్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ను బౌల్డ్‌ చేశాడు. ఫాస్ట్‌ ఇన్‌స్వింగర్‌తో అతడిని బోల్తా కొట్టించాడు. 

ఆ తర్వాత భారత పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా రంగంలోకి దిగాడు. 13 ఓవర్‌ మూడో బంతికి లంక యువ ఆల్‌రౌండర్‌ దునిత్‌ వెల్లలగేను అవుట్‌ చేశాడు. అనంతరం.. పదహారో ఓవర్లో పాండ్యా బౌలింగ్‌లో ప్రమోద్‌ ఇచ్చిన క్యాచ్‌ విరాట్‌ కోహ్లి ఒడిసిపట్టడంతో లంక తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాతి బంతికే పతిరణ కూడా అవుట్‌! ఇంకేముంది 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్‌..

అసలు ఇది వన్డే మ్యాచా లేదంటే.. టీ20నా.. ఓసారి గిల్లి చూసుకోవాల్సిందే అనేంతలా  టీమిండియా ఫాస్ట్‌బౌలర్ల విజృంభణతో పాపం దసున్‌ షనక బృందం ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 15.2 ఓవర్లలోనే చాపచుట్టేసింది. సొంతగడ్డపై అవమానకర రీతిలో భారీ పరాభవం మూటగట్టుకుంది. టీమిండియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

సిరాజ్‌ సహా బుమ్రా, పాండ్యా అద్భుతంగా రాణించి ప్రత్యర్థిని కట్టడి చేయగా.. ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేశాడు భారత సారథి రోహిత్‌ శర్మ. తన స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌కు జోడీగా ఈ వికెట్‌ కీపర్‌ను పంపాడు. కెప్టెన్‌ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ ఇద్దరు కుర్రబ్యాటర్లు ఏమాత్రం వమ్ము చేయలేదు. ఇషాన్‌ 18 బంతుల్లో 23, గిల్‌ 19 బంతుల్లో 27 పరుగులతో అదరగొట్టి.. 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించేలా చేశారు. ఇంకేముంది ఎనిమిదోసారి భారత్‌ ఆసియా కప్‌ ట్రోఫీని ముద్దాడింది.

చదవండి: నా శరీరం 40 ఏళ్లు అంటోంది.. ఐడీ 31 చూపిస్తోంది.. కానీ: డికాక్‌ భావోద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement