మీడియా సమావేశంలో మాట్లాడుతున్న నీరజ్ చోప్రా. చిత్రంలో ఏఎఫ్‌ఐ ప్లానింగ్ కమిటీ చైర్మన్ లలిత్ భానోత్ , ఏఎఫ్‌ఐ ఉపాధ్యక్షురాలు అంజూ జార్జి
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బంగారంతో చరిత్ర సృష్టించిన రోజు ఇక ప్రతి యేటా పండగ కానుంది. వేడుకగా జరగనుంది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ఆగస్టు 7వ తేదీని ‘జాతీయ జావెలిన్ డే’గా నిర్వహిస్తామని ప్రకటించింది. 23 ఏళ్ల నీరజ్ ఈ నెల 7న టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో మెరిసి అథ్లెటిక్స్ పసిడి కలను నిజం చేశాడు. విశ్వక్రీడల అథ్లెటిక్స్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు.
స్వదేశం చేరిన నీరజ్‌ను ఏఎఫ్‌ఐ మంగళవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఏఎఫ్‌ఐ ప్రణాళిక సంఘం చైర్మన్ లలిత్ భానోత్ ‘దేశంలో జావెలిన్ త్రోకు ప్రాచుర్యం తెచ్చేందుకు, ఈ క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకు ఇకపై ఆగస్టు 7వ తేదీని జాతీయ జావెలిన్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇందులో భాగంగా యేటా ఆ రోజు రాష్ట్ర సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తాం. వేడుకగా బహుమతుల ప్రదానోత్సవం జరుపుతాం’ అని తెలిపారు. నీరజ్ చోప్రా మాట్లాడుతూ ‘నాకు చాలా గర్వంగా ఉంది. నా స్వర్ణ విజయాన్ని చిరస్మరణీయంగా మారుస్తున్నందుకు సంతోషంగా ఉంది. అథ్లెటిక్స్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఎంతో మందికి ఇది ప్రేరణ అవుతుంది’ అని అన్నారు.
నా లక్ష్యం ప్రపంచ చాంపియన్‌షిప్...
ఒలింపిక్ స్వర్ణ పతకంతో తన ప్రయాణం ఆగిపోదని భవిష్యత్‌లో జరిగే అన్ని మెగా ఈవెంట్స్‌లో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతానని నీరజ్ వ్యాఖ్యానించాడు. ‘నేను ఇదివరకే 2018 ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకాలు గెలిచాను. ఇప్పుడు ఒలింపిక్ స్వర్ణం సాధించాను. ఇక నా లక్ష్యం వచ్చే ఏడాది అమెరికాలో జరిగే ప్రపంచ చాంపియషిప్ టైటిల్. ఇది కూడా పెద్ద ఈవెంట్. చెప్పాలంటే ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోని మెగా ఈవెంట్. ఒక్క ఒలింపిక్ స్వర్ణంతోనే ఆగిపోను. ఇంకా మెరుగయ్యే ందుకు కష్టపడతాను. తదుపరి ఆసియా, కామన్వెల్త్ గేమ్స్, ఒలిం పిక్స్ పతకాలు నెగ్గేందుకు కృషి చేస్తాను’ అని నీరజ్ అన్నాడు.
నీరజ్ నెగ్గిన స్వర్ణ పతకంతో తల్లిదండ్రులు సతీశ్, సరోజ్ దేవి, చిన్నాన్న భీమ్ చోప్రా
మాజీ లాంగ్‌జంపర్, ప్రస్తుత ఏఎఫ్‌ఐ ఉపాధ్యక్షురాలైన అంజూ బాబీ జార్జ్ మాట్లాడుతూ ‘నీరజ్ స్వర్ణం తెచ్చిన రోజు భారత అథ్లెటిక్స్ చరిత్రలో కలకాలం నిలిచిపోయే రోజు. అథ్లెటిక్స్‌లో ఇంతకు మించిన ఘనత ఇంకోటి లేనే లేదు. యువతకు అతనే స్ఫూర్తి’ అని కొనియాడింది. మరోవైపు పంజాబ్ ప్రభుత్వం శనివారం నిర్వహించే కార్యక్రమంలో నీరజ్ చోప్రాకు రూ. 2 కోట్ల 51 లక్షలు... కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టులో సభ్యులుగా ఉన్న 8 మంది తమ రాష్ట్ర ఆటగాళ్లకు రూ. 2 కోట్ల 51 లక్షల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment