వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
మెల్‌బోర్న్ వేదికగా అరంగేట్ర బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.
శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున ఇద్దరు యువ పేసర్లు లాన్స్ మోరిస్, జేవియర్ బార్ట్‌లెట్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు జేవియర్ ఆది నుంచే చుక్కలు చూపించాడు. తొలుత ఓపెనర్లు జస్టిన్ గ్రీవ్స్(1), అలిక్ అథనాజే(5)ల పనిపట్టిన ఈ రైటార్మ్ పేసర్.. కెప్టెన్ షాయీ హోప్(12) రూపంలో మరో కీలక వికెట్ దక్కించుకున్నాడు.
జేవియర్ దెబ్బకు బ్యాటింగ్ ఆర్డర్ కకావిలమైన వేళ వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ 88 పరుగులతో సత్తా చాటాడు. అతడికి తోడుగా రోస్టర్ చేస్ కూడా అర్ధ శతకం(59)తో మెరిశాడు. మిగతా వాళ్లలో ఒక్కరుకూడా చెప్పుకోగదగ్గ స్కోరు చేయలేదు.
జేవియర్ అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. సీన్ అబాట్, కామెరాన్‌గ్రీన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఆడం జంపాకు ఒక వికెట్ దక్కగా.. అబాట్ కేసీ కార్టీని రనౌట్‌లో భాగమయ్యాడు. ఈ క్రమంలో 48.5 ఓవర్లలో 231 పరుగులు చేసి విండీస్ ఆలౌట్ అయింది.
లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు కరేబియన్ పేసర్ మాథ్యూ ఫోర్డ్ ఆదిలోనే షాకిచ్చాడు. అతడి బౌలింగ్‌లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
అయితే, మరో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు బ్యాట్ ఝులిపించాడు. 43 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఏకంగా 65 పరుగులు రాబట్టాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ 77, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.
విండీస్ విధించిన 232 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది ఆస్ట్రేలియా. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో జేవియర్ బార్ట్‌లెట్ తొమ్మిది ఓవర్లు బౌల్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 4న సిడ్నీలో రెండో వన్డే జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment