రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. టెస్ట్ కెరీర్‌లో మొదటి బంతికే వికెట్ (స్టీవ్ స్మిత్) తీసిన షమార్.. టైరెల్ జాన్సన్ (1939లో ఇంగ్లండ్‌పై) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో విండీస్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 23వ బౌలర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్, లబూషేన్, కెమరూన్ గ్రీన్ లాంటి హేమాహేమీ బ్యాటర్లు సహా ఐదు వికెట్ల ఘనత సాధించిన షమార్.. టెస్ట్ అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన 11వ విండీస్ బౌలర్‌గా నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో 11వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు ఎంతో అవసరమైన 36 పరుగులు చేసిన షమార్.. విండీస్ తరఫున టెస్ట్‌ల్లో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసిన 11వ నంబర్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ప్రదర్శనలతో షమార్ మరిన్ని ఘనతలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ అరంగేట్రంలోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి విండీస్ బౌలర్‌గా.. ఆస్ట్రేలియాలో టెస్ట్ అరంగేట్రంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన పదో పర్యాటక బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
కాగా, షమార్ ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/94) విజృంభించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ (119) సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అంతకుముందు హాజిల్‌వుడ్ (4/44), కమిన్స్ (4/41) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్‌కెంజీ (50), షమార్ జోసఫ్ (36) మాత్రమే రాణించారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 95 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్‌ను హాజిల్‌వుడ్ (4/18) మరోసారి దారుణంగా దెబ్బకొట్టాడు. హాజిల్‌వుడ్ ధాటికి విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతుంది. విండీస్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 22 పరుగుల దూరంలో ఉంది.
సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వదిలి..
ఆసీస్‌తో తొలి టెస్ట్‌లో సంచలన ప్రదర్శన నమోదు చేసిన షమార్ జోసఫ్.. తనకెంతో ఇష్టమైన క్రికెట్ కోసం తన జీవనాధారమైన సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. కరీబియన్ దీవుల్లోని ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన షమార్.. టెస్ట్ అరంగేట్రానికి ముందు కేవలం ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 24 ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్ అయిన షమార్ అంతర్జాతీయ అరంగేట్రంలో తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకుని పలు రికార్డులు కొల్లగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment