అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 50 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేశాడు. ఫలితంగా ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీ20ల్లో మ్యాక్స్‌వెల్‌కు ఇది ఐదో శతకం. అంతర్జాతీయ టీ20ల్లో కేవలం రోహిత్ శర్మ మాత్రమే ఇన్ని శతకాలు చేశాడు.
మ్యాక్సీ ఊచకోత ధాటికి విండీస్ బౌలర్లు విలవిలలాడిపోయారు. మ్యాక్స్‌వెల్ వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్‌లోకి తరలించాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ 120 పరుగులు (55 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాక్సీకి జతయ్యాడు. వీరిద్దరూ విండీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు.
SWITCH HIT FOR SIX BY MAXWELL 🤯🔥pic.twitter.com/wZ73ZsmhBm
— Johns. (@CricCrazyJohns) February 11, 2024
వార్నర్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తమదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. జోష్ ఇంగ్లిస్ (4) విఫలమయ్యాడు. స్టోయినిస్ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. మొత్తంగా ఆసీస్ బ్యాటర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో విండీస్ బౌలింగ్ లైనప్ కకావికలమైంది.
ఆ జట్టు బౌలర్లలో జేసన్ హోల్డర్ 2, అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అల్జరీ జోసఫ్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరిదైన మూడో టీ20 పెర్త్ వేదికగా ఫిబ్రవరి 13న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment