
లండన్: ‘యాషెస్’ సిరీస్‌లో తొలి టెస్టు గెలిచి జోరు మీదున్న ఆస్ట్రేలియా రెండో టెస్టులోనూ పట్టు బిగిస్తోంది. ఇంగ్లండ్‌తో ‘లార్డ్స్’ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 45.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (123 బంతుల్లో 58 నాటౌట్; 10 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (6 నాటౌట్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.
ఓపెనర్ డేవిడ్ వార్నర్ (25)తో పాటు మార్నస్ లబుషేన్ (30) అవుటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా ఓవరాల్‌గా 221 పరుగులు ముందంజలో ఉంది. మ్యాచ్ నాలుగో రోజు శనివారం కూడా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగిస్తే భారీ లక్ష్యంతో ఇంగ్లండ్‌కు సవాల్ విసరవచ్చు. ఓవర్‌నైట్ స్కోరు 278/4తో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకే ఆలౌటైంది.
హ్యారీ బ్రూక్ (50) అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... స్టోక్స్ (17), బెయిర్‌స్టో (16) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో శుక్రవారం ఇంగ్లండ్ బ్యాటింగ్ కుప్పకూలింది. 15.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగిన ఆ జట్టు 47 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. మిచెల్ స్టార్ 3 వికెట్లు పడగొట్టగా... ట్రవిస్ హెడ్, హాజల్‌వుడ్ చెరో 2 వికెట్లు తీశారు. వర్షం కారణంగా మొత్తం 61 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
మరో వైపు గురువారం ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లయన్ మూడో రోజు మైదానంలోకి దిగలేదు. గాయం తీవ్రంగా కనిపిస్తున్న నేపథ్యంలో అతను ఈ టెస్టుతో పాటు యాషెస్‌లో మిగిలిన టెస్టులకు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.