
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌లో మరో శకం ముగిసింది. ఆ జట్టు సీనియర్ క్రికెటర్ రేచల్ హేన్స్ గురువారం అంతర్జాతీయం సహా అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించింది. 2009లో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రేచల్ హేన్స్ దశాబ్దానికి పైగా ఆసీస్ క్రికెట్‌లో ప్రధాన బ్యాటర్‌గా సేవలందించింది. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా మహిళల జట్టు గెలిచిన ఆరు మేజర్ టోర్నీల్లో రేచల్ హేన్స్ ఉండడం విశేషం.
ఇక ఆస్ట్రేలియా తరపున రేచల్ హేన్స్ 6 టెస్టుల్లో 383 పరుగులు, 77 వన్డేల్లో 2585 పరుగులు, 84 టి20ల్లో 850 పరుగులు చేసింది. హేన్స్ ఖాతాలో రెండు వన్డే సెంచరీలు ఉన్నాయి. కాగా టెస్టుల్లో అరంగేట్రం ఇచ్చిన డెబ్యూ మ్యాచ్‌లోనే హేన్స్ 98 పరుగులు చేసి ఆకట్టుకుంది. హేన్స్ కెరీర్‌ను రెండు భాగాలుగా విడదీయొచ్చు. 2009 నుంచి 2013 వరకు, ఆ తర్వాత నాలుగేళ్ల పాటు క్రికెట్‌కు దూరమైన హేన్స్ 2017 నుంచి 2022 వరకు ఆటలో కొనసాగింది.
ఇక హేన్స్ చివరగా బర్మింగ్‌హమ్ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆడింది. ఈ మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా స్వర్ణ పతకం గెలిచింది. ఇక హేన్స్ పలు సందర్భాల్లో జట్టును నడిపించింది. 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఒక మ్యాచ్‌లో జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ భుజం గాయంతో పక్కకు తప్పుకోవడంతో నాయకత్వ బాధ్యతలు నిర్వహించింది. ఆ తర్వాత 2018లో తొలిసారి వైస్ కెప్టెన్ అయిన రేచల్ హేన్స్ 2020లో టి20 వరల్డ్ కప్, 2022లో వన్డే వరల్డ్‌కప్‌ను గెలవడంలో.. కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియా స్వర్ణం గెలవడంలోనూ కీలకపాత్ర పోషించింది.
''ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ఒక రేచల్ హేన్స్ సేవలు కోల్పోనుంది. దాదాపు దశాబ్దానికి పైగా క్రికెట్‌లో సేవలందించిన రేచల్ హేన్స్ ఇవాళ ఆటకు వీడ్కోలు పలకడం మా దురదృష్టం. ఇన్నేళ్లలో ఆమె జట్టు తరపున ఎన్నో విజయాల్లో పాలు పంచుకుంది. రేచల్ హేన్స్ ఆడిన కాలంలో ఆస్ట్రేలియా ఆరు మేజర్ టోర్నీలు గెలవడం ఆమెకు గర్వకారణం. మలి ప్రయాణం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నాం'' అంటూ ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ నిక్ హాక్‌లీ చెప్పుకొచ్చాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రేచల్ హేన్స్ ఈ సీజన్ తర్వాత అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకోనుంది.
చదవండి: 'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'.. ఎంతైనా పాక్ క్రికెటర్!
Comments
Please login to add a commentAdd a comment