సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమిండియా ఆటగాడు, గుజరాత్ ప్లేయర్ అక్షర్ పటేల్ చెలరేగిపోయాడు. కర్ణాటకతో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో అక్షర్ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్ 20 బంతులను ఎదుర్కొని 2 ఫోర్లు, అర డజన్లు సిక్సర్ల సాయంతో అజేయమైన 56 పరుగులు చేశాడు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో విద్యాధర్ అనే వ్యక్తి బౌలింగ్‌లో అక్షర్ పేట్రేగిపోయాడు. ఈ ఓవర్‌లో అతను ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. ఇందులో 3 సిక్సర్లు, ఓ బౌండరీ ఉంది. అక్షర్ విజృంభించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 251 పరుగుల భారీ స్కోర్ చేసింది.
AXAR PATEL SMASHED 6,2,6,4,0,6 - 24 RUNS IN THE FINAL OVER. 🤯 pic.twitter.com/lTV3Of4CLV
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 5, 2024
ఓపెనర్ ఆర్య దేశాయ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మరో ఓపెనర్, ఈ సీజన్‌లో రెండు వేగవంతమైన సెంచరీలు చేసిన ఉర్విల్ పటేల్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు. అభిషేక్ దేశాయ్ 32 బంతుల్లో 47.. హేమంగ్ పటేల్ 12 బంతుల్లో 30 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో కౌశిక్, భాండగే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. విద్యాధర్ పాటిల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కర్ణాటక గెలుపు కోసం చివరి వరకు పోరాడింది. ఆ జట్టు 19.1 ఓవర్లలో 203 పరుగులు చేసి ఆలౌటైంది. ఫలితంగా 48 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. స్మరన్ రవిచంద్రన్ (49), మయాంక్ అగర్వాల్ (45), మనీశ్ పాండే (30), కృష్ణణ్ శ్రీజిత్ (26) కర్ణాటకను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, నగస్వల్లా చెరో 2, చింతన్ గజా, విశాల్ జేస్వాల్, ఆర్య దేశాయ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment