టీమిండియా ఆటగాడు తిలక్ వర్మ నవంబర్ నెలలో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ నెలలో తిలక్ ఏకంగా మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. నవంబర్ 13న సౌతాఫ్రికాపై సెంచరీ (107 నాటౌట్ (56 బంతుల్లో)) చేసిన తిలక్.. ఆతర్వాత నవంబర్ 15న ఆదే సౌతాఫ్రికాపై మరో సెంచరీ (120 నాటౌట్ (47 బంతుల్లో)) బాదాడు.
ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో తిలక్ ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. నవంబర్ 23న మేఘాలయతో జరిగిన తొలి మ్యాచ్‌లో 67 బంతుల్లో శతక్కొట్టిన (151) తిలక్.. ఆతర్వాతి మ్యాచ్‌లో (నవంబర్ 25) బెంగాల్‌పై హాఫ్ సెంచరీ (57) చేశాడు.
దీని తర్వాత ఒక్క మ్యాచ్‌లో విఫలమైన తిలక్, తిరిగి ఇవాళ (నవంబర్ 29) బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో హాఫ్ సెంచరీతో (51 నాటౌట్) మెరిశాడు. మొత్తంగా నవంబర్ మాసం తిలక్‌కు అచొచ్చినట్లుంది. ఈ నెలలో తిలక్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. టీ20ల్లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా తిలక్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ ఫీట్‌ను కూడా తిలక్ నవంబర్‌లోనే సాధించాడు.
ఇదిలా ఉంటే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ అజేయమైన సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో బీహార్‌పై హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బీహార్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. తెలకపల్లి రవితేజ 4 వికెట్లు తీసి బీహార్‌ను దెబ్బకొట్టాడు. మిలింద్, అజయ్ దేవ్ గౌడ్ తలో 2, నితిన్ సాయి యాదవ్ ఓ వికెట్ పడగొట్టారు. బీహార్ ఇన్నింగ్స్‌లో కుమార్ రజనీశ్ (22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ 12.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి విజయతీరాలకు చేరింది. తిలక్ వర్మ (31 బంతుల్లో 51 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), రోహిత్ రాయుడు (33 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) హైదరాబాద్‌ను గెలిపించారు.
Comments
Please login to add a commentAdd a comment