IND Vs AUS 2nd Test Day-2 Analaysis.. ఢిల్లీ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండోరోజు ఆట ముగిసింది. రెండోరోజు ఆటలో ఆస్ట్రేలియా రెండు సెషన్ల పాటు పూర్తి ఆధిపత్యం కనబరిచింది. పిచ్ మనకు అనూకూలంగా ఉంటుందనుకుంటే రెండో రోజు ఆటలో అంతా రివర్స్ అయింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ మరోసారి తన మ్యాజిక్ చూపెట్టాడు.
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగి విమర్శల పాలయ్యాడు. అటు కెప్టెన్ రోహిత్ కూడా పెద్దగా ఆడలేదు. ఇక వందో టెస్టు ఆడుతున్న పుజారా ఇరగదీస్తాడనుకుంటే డకౌట్ అయ్యాడు. టాపార్డర్‌లో మళ్లీ అదే పరిస్థితి కనిపించింది. ఇక మిడిలార్డర్ విషయానికి వస్తే కోహ్లి కాస్త పర్వాలేదనిపించాడు. 44 పరుగులతో జట్టులో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లి ఔట్ కాదని అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడని తర్వాత తేలింది. ఒకవేళ కోహ్లి ఔట్ కాకపోయుంటే సెంచరీ చేసేవాడేమో.
సూర్య స్థానంలో వచ్చిన అయ్యర్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌లు ఇలా వచ్చి అలా వెళ్లారు. తొలి టెస్టు హీరో జడేజా కూడా 25 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో టీమిండియా 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చూస్తుంటే తొలి టెస్టులో ఆస్ట్రేలియా పరిస్థితే మనకు వచ్చినట్లుగా అనిపించింది. అయితే ఈ దశలో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తానున్నానంటూ ఆపద్భాందవుడిలా వచ్చాడు. అక్షర్‌కు అశ్విన్ తోడయ్యాడు. స్టార్ బ్యాటర్లంతా విఫలమైన చోట అక్షర్ మాత్రం చక్కగా బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్‌లో విఫలమైనప్పటికి తనలో మంచి బ్యాటర్ దాగున్నాడని మరోసారి చూపించాడు.
బౌండరీలు కొట్టడానికి భయపడిన చోట అక్షర్ సిక్సర్లు బాదాడు. సిక్సర్‌తోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అశ్విన్ కూడా పరిణితితో కూడిన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఇద్దరు స్వల్ప వ్యవధి తేడాలో ఔట్ కావడంతో టీమిండియా 262 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు కేవలం ఒక్క పరుగు ఆధిక్యం మాత్రమే లభించింది. చివరికి ఆట ఆఖరికి వచ్చేసరికి కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకొని అక్షర్ పటేల్ మ్యాచ్ రెండో రోజు హీరోగా నిలిచాడు. అక్షర్ పటేల్ ఇన్నింగ్స్‌తో టీమిండియాలో ఒక లోటు తీరిపోయింది. కొన్నాళ్లుగా టీమిండియా బలహీనంగా ఉన్న లోయర్ ఆర్డర్ సమస్య తీరిపోయింది. ఇప్పుడు టీమిండియా ఒకటో నెంబర్ నుంచి ఎనిమిదో నెంబర్ దాకా బ్యాటింగ్ చేసేందుకు బ్యాటర్లు ఉండడం సానుకూలాంశం.
Comments
Please login to add a commentAdd a comment