పాకిస్తాన్ క్రికెట్.. గత కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో వరుస వైఫల్యాలు, పసికూనల చేతిలో ఓటములు, టెస్టుల్లో వైట్‌వాష్‌లు, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌లేమి, తరచూ సెలక్టర్లు, కెప్టెన్ల మార్పులు.. వెరసి తీవ్ర విమర్శలు. అసలు దీనంతటికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వైఖరే కారణమంటూ మాజీ క్రికెటర్ల నుంచి ఆరోపణలు.
తాజాగా పీసీబీ గురించి మరో విషయం తెరమీదకు వచ్చింది. గత మూడు నెలలుగా పురుష, మహిళా క్రికెటర్లకు వేతనాలు చెల్లించలేదని తెలుస్తోంది. నెలవారీ పేమెంట్లతో పాటు స్పాన్సర్‌షిప్ షేర్లు ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆటగాళ్లంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పాక్ క్రికెట్ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.
కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ జాప్యం
అంతేకాదు.. సెంట్రల్ కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ బోర్డు జాప్యం చేయడం ఆటగాళ్లను మరింత చికాకు పెడుతోందని పేర్కొన్నాయి. ఇక వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం.. కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాలను అభివృద్ధి చేసేందుకు పీసీబీ ఉపయోగిస్తోందని తెలిపాయి.
తీవ్ర అసంతృప్తి
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నాటికి ఈ మూడు మైదానాలను పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపై పీసీబీ శ్రద్ధ చూపుతోందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, వరుస సిరీస్‌లు ఆడుతున్నా..ఇంకా వేతనాలు చెల్లించకపోవడంతో క్రికెటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. దాని ప్రభావం ఆటపై పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి.
ఈ నేపథ్యంలో నెలరోజుల్లోగా బకాయిలన్నీ తీర్చేందుకు పీసీబీ కసరత్తు చేస్తుందని సదరు వర్గాలు వెల్లడించాయి. కాగా గతేడాది వార్షిక కాంట్రాక్టుల విడుదలకు ముందు ఆటగాళ్లతో చర్చించిన పీసీబీ.. జీతాలను పెంచుతూ చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
‘ఎ’ కేటగిరీలో ఉన్న బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది వంటి వాళ్లకు నెలవారీ 4.5 మిలియన్ల పాక్ రూపాయలతో(టాక్స్ చెల్లింపుల తర్వాత) పాటు.. అదనంగా లోగో స్పాన్సర్‌షిప్స్ నుంచి పీసీబీకి వచ్చే ఆదాయంలో మూడు శాతం మేర ఇవ్వనున్నట్లు డీల్ కుదిరింది.
జీతాల చెల్లింపునకే గతిలేక
అయితే, ఇప్పుడు ఇలా జీతాల చెల్లింపునకే గతిలేక బోర్డు జాప్యం చేయడం గమనార్హం. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడేందుకు వెళ్లిన పాక్ మహిళా క్రికెటర్లకు కూడా ఇంతవరకు జీతాలు ఇవ్వలేదని సమాచారం.
చదవండి: ఇదేం బౌలింగ్?.. హార్దిక్ శైలిపై కోచ్ అసంతృప్తి!.. ఇకపై..
Comments
Please login to add a commentAdd a comment