పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి బాబర్ ఆజం రాజీనామా వెనుక హెడ్‌కోచ్ గ్యారీ కిర్‌స్టన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తన పట్ల కోచ్ వ్యవహరించిన తీరుకు నొచ్చుకున్న అతడు.. బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. జట్టు వైఫల్యాలకు తనొక్కడినే బాధ్యుడిని చేస్తూ.. తప్పంతా తన మీదకు వచ్చేలా కిర్‌స్టన్ నివేదిక రూపొందించడం పట్ల అతడు మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది.
కాగా పాక్ క్రికెట్ జట్టుకు వన్డే, టీ20 ఫార్మాట్‌లలో కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం వైదొలిగిన విషయం తెలిసిందే. తాను సారథ్య బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు. బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి, టీమ్ మేనేజ్‌మెంట్‌కు గతంలోనే సమాచారం అందించినట్లు బాబర్ చెప్పాడు.
ఈ రాజీనామా తర్వాత
‘పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అయితే అసలు బాధ్యత బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. నాయకత్వం కారణంగా నాపై అదనపు భారం పడుతోంది. నా ఆటను మరింతగా ఆస్వాదిస్తూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతో పాటు కుటుంబానికి తగినంత సమయం కేటాయించడం కూడా అవసరం.
ఈ రాజీనామా తర్వాత నా శక్తియుక్తులన్నీ బ్యాటింగ్‌పైనే కేంద్రీకరించగలను. నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. జట్టుకు ఒక ఆటగాడిగా అన్ని విధాలా ఉపయోగపడేందుకు నేను సిద్ధం’ అని బాబర్ ఆజమ్ ఒక ప్రకటన విడుదల చేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ సెమీస్ కూడా చేరకపోవడంతో బాబర్ నైతిక బాధ్యత వహిస్తూ.. ఆ టోర్నీ తర్వాత మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ వదలుకున్నాడు.
అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు అతడినే సారథిగా నియమించింది పీసీబీ. ఈసారి మరీఘోరమైన ప్రదర్శనతో బాబర్ బృందం విమర్శలు మూటగట్టుకుంది. పసికూన అమెరికా జట్టు చేతిలో ఓడి.. సూపర్-8కు కూడా అర్హత సాధించలేకపోయింది.
అందుకే ఈ నిర్ణయం
ఈ నేపథ్యంలో కోచ్ కిర్‌స్టన్ పీసీబీకి ఇచ్చిన నివేదికలో బాబర్ ఆజంనే కారకుడిగా పేర్కొన్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. అసిస్టెంట్ కోచ్ అజర్ మహ్మూద్ సైతం బాబర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంతో.. ఇక తాను కెప్టెన్‌గా ఉండకూడదని బాబర్ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాయి.
ఇక బాబర్ ఆజం రాజీనామాను ఆమోదించిన పీసీబీ త్వరలోనే కొత్త కెప్టెన్‌ను నియమించనుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది పేర్లు వన్డే, టీ20 కెప్టెన్సీ రేసులో వినిపించగా.. బోర్డు అనూహ్యంగా సౌద్ షకీల్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
రేసులోకి కొత్త పేరు
ఇక అక్టోబరులో పాకిస్తాన్ క్రికెట్ జట్టు 3 వన్డేలు, 3 టీ20ల కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆలోగా కెప్టెన్ ఎంపిక పూర్తవుతుంది. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై ఈ నెల 7 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ తలపడుతుంది. పాక్ టెస్టు జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. బాబర్ స్థానంలో పగ్గాలు చేపట్టిన అతడి సారథ్యంలో పాక్ ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.
Comments
Please login to add a commentAdd a comment