కోహ్లి, ఫించ్‌ల సరసన అజామ్‌ | Babar Azam Equals Virat Kohli, Aaron Finchs T20I Record | Sakshi
Sakshi News home page

కోహ్లి, ఫించ్‌ల సరసన అజామ్‌

Published Mon, Aug 31 2020 11:22 AM | Last Updated on Mon, Aug 31 2020 11:29 AM

Babar Azam Equals Virat Kohli, Aaron Finchs T20I Record - Sakshi

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో పాకిస్తాన్‌ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నాలుగు వికెట్లకు 195 పరుగులు చేసింది. కాగా, చివరకు ఇంగ్లండ్‌నే విజయం వరించింది. ఆఖరి ఓవర్‌ తొలి బంతికి ఇంగ్లండ్‌ విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా, మూడో టీ20 మంగళవారం జరుగనుంది. రెండో టీ20లో పాక్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(56) హాఫ్‌ సెంచరీ సాధించాడు.  ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో 1,500 పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. ఈ క్రమంలోనే వేగవంతంగా పదిహేను వందల అంతర్జాతీయ టీ20 పరుగుల్ని సాధించిన ఆటగాళ్ల సరసన నిలిచాడు.

అంతకుముందు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఆసీస్‌ వన్డే కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌లు వేగవంతంగా 1,500 పరుగుల మార్కును చేరిన ఆటగాళ్లు కాగా, ఇప్పుడు వారి సరసన అజామ్‌ కూడా స్థానం సంపాదించాడు. అజామ్‌కు ఇది 39వ అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌. ఈ మ్యాచ్‌కు ముందు అజామ్‌ పదిహేను వందల పరుగులకు 29 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ మార్కును సులభంగానే చేరిన అజామ్‌.. ఆపై హాఫ్‌ సెంచరీతో మెరిశాడు.  ఇది అజామ్‌కు 14వ టీ20 హాఫ్‌ సెంచరీ.ఇక పాకిస్తాన్‌ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి తోడు మలాన్‌ 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 54 పరుగులు సాధించడంతో ఇంగ్లండ్‌ సులభంగానే గెలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement