దుబాయ్: ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబార్ ఆజమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఇటీవలే టీమిండియా సారధి విరాట్ కోహ్లి నుంచి వన్డే టాప్ ర్యాంక్‌ను చేజిక్కించుకున్న బాబర్.. టీ20 అగ్రస్థానంపై కూడా కన్నేశాడు. దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గతవారం జరిగిన మూడవ టీ20లో అద్భుత శతకంతో(122) అదరగొట్టిన బాబార్.. 47 రేటింగ్ పాయింట్లు దక్కించుకుని రెండో స్థానంలో ఉన్న ఆసీస్ ఆటగాడు ఆరోన్ ఫించ్‌ను వెనక్కునెట్టి ఆ స్థానానికి దూసుకొచ్చాడు. సఫారీలపై బాబర్ సాధించిన శతకం అతని కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టీ20 శతకం కావడం విశేషం.
ప్రస్తుతం 844 రేటింగ్ పాయింట్లు కలిగి ఉన్న బాబర్... అగ్రస్థానంలో ఉన్న డేవిడ్ మలాన్(ఇంగ్లండ్)(892) కంటే కేవలం 48 పాయింట్లు మాత్రమే వెనుకపడి ఉన్నాడు. కాగా, గతేడాది నవంబర్ వరకు టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగిన బాబర్‌కు మరోసారి టీ20 అగ్రపీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది. పాక్ జట్టు నేటి (ఏప్రిల్ 21) నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో బాబర్ ఓ మోస్తరుగా రాణించినా డేవిడ్ మలాన్ అగ్రస్థానానికి ఎసరు పెట్టడం ఖాయం.
ఇదిలా ఉంటే, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(762) ఒక స్థానం కిందకు పడిపోయాడు. గతవారం ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న విరాట్.. తాజా జాబితాలో ఐదో ర్యాంక్‌కు దిగజారాడు. టీమిండియాకు చెందిన మరో ఆటగాడు కేఎల్ రాహుల్(743) సైతం రెండు స్థానాలు కోల్పోయి 7వ స్థానంలో ఉండగా, భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(613) ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని 13వ ర్యాంక్‌కు చేరాడు. ఇక టీ20 బౌలర్ల జాబితా విషయానికొస్తే.. దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంషి(732), ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్(719), ఆసీస్ బౌలర్ ఆష్టన్ అగర్‌లు(702) మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీం ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్(272) మొదటి స్థానంలో ఉండగా, భారత్(270), ఆస్ట్రేలియా(267), పాక్(262) వరుసగా రెండు నుంచి నాలుగు ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నాయి.
చదవండి: వైరలవుతున్న టీమిండియా ప్రస్తుత, మాజీ కెప్టెన్ల భార్యల ఫోటోలు
Comments
Please login to add a commentAdd a comment