BBL: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ! చివరికి ఏమైందంటే? | BBL 2023 24: Sydney Sixers win Over Adelaide Strikers Final Ball Thriller | Sakshi
Sakshi News home page

BBL: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ! చివరికి ఏమైందంటే?

Published Fri, Dec 22 2023 5:50 PM | Last Updated on Fri, Dec 22 2023 8:08 PM

BBL 2023 24: Sydney Sixers win Over Adelaide Strikers Final Ball Thriller - Sakshi

Big Bash League 2023-24: Sydney Sixers vs Adelaide Strikers: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచిన జట్టు పట్టరాని సంతోషంలో మునిగిపోతే.. ఓడిన జట్టుకు అంతకంటే బాధ మరొకటి ఉండదు.. బిగ్‌ బాష్‌ లీగ్‌ జట్లు సిడ్నీ సిక్సర్స్‌- అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నాయి.

క్రికెట్‌ ఆస్ట్రేలియా నేతృత్వంలో ప్రస్తుతం బీబీఎల్‌ 2023-24 సీజన్‌ నడుస్తోంది. డిసెంబరు 7న మొదలైన ఈ టీ20 లీగ్‌.. జనవరి 24 నాటి ఫైనల్‌తో ముగియనుంది. ఇదిలా ఉంటే.. బీబీఎల్‌లో భాగంగా సిడ్నీ- అడిలైడ్‌ జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపింది.

సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ సిడ్నీ సిక్సర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో సిడ్నీ బ్యాటర్‌ జోర్డాన్‌ సిల్క్‌ 45 బంతుల్లో 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

ఓపెనర్‌ ఫిలిప్‌(16 బంతుల్లో 25 పరుగులు)తో కలిసి జట్టును గట్టెక్కించాడు. వీరిద్దరి ధనాధన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా సిడ్నీ సిక్సర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.

కెప్టెన్‌ మాథ్యూ షార్ట్‌ (48 బంతుల్లో 55), జెమ్మీ ఓవర్టన్‌ (28 బంతుల్లో 31 పరుగులు(నాటౌట్‌)) ఇన్నింగ్స్‌ వృథా అయింది. గెలుపొందాలంటే చివరి బాల్‌కు మూడు పరుగులు తీయాల్సి ఉండగా.. ఓవర్టన్‌ రెండు పరుగులు మాత్రమే తీయగలిగాడు. దీంతో విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది అడిలైడ్‌ జట్టు.

ఇక.. అదే ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన సిడ్నీ సిక్సర్స్‌ సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టీ20 ఫార్మాట్‌ అంటేనే సంచలనాలకు మారుపేరు అన్న విషయం మరోసారి రుజువైందంటూ నెటిజన్లు ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement