న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తమ వార్షిక కాంట్రాక్ట్ నిబంధనలను మార్చాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని నిబంధనలను సవరించనుంది. ఫలితంగా ఇక నుంచి టీమిండియా తరఫున బరిలోకి దిగే టీ20 ఆటగాళ్లకు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కనుంది. ఇందుకు ఆ ఆటగాడు కనీసం పది టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. గతంలో ఈ ఒప్పందాలు కేవలం వన్డే, టెస్టు ఆటగాళ్లకు ఉండేవి. సుప్రీం కోర్టు నియమిత పరిపాలక కమిటీ (సీఓఏ) హయాంలో పొట్టి ఫార్మాట్‌లో ఆడేవారికీ ఒప్పందం ఇవ్వాలని సూచించినా అప్పట్లో బోర్డు వ్యతిరేకించింది. ఆలస్యమైనా మొత్తానికి నాలుగు కేటగిరీల్లోనూ ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్ట్‌లు అందిస్తోంది. (టీమిండియాకే కాదు.. మాకూ ఉన్నారు: క్యారీ)
‘పాత నిబంధనలను మార్చాలని బోర్డు నిర్ణయించింది. ఈ సవరణతో ఏడాదిలో కనీసం పది అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లకు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ లభిస్తుంది’ అని బోర్డు వర్గాలు తెలిపాయి. ఎ+ కేటగిరీలో ఉన్న వారికి ఏడాదికి రూ.7 కోట్లు, ఎ కేటగిరీలో రూ.5 కోట్లు, బి కేటగిరీలో రూ.3 కోట్లు, సి కేటగిరీలో రూ.1 కోటి వార్షిక వేతనం అందుతుంది. గతంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కాలంటే ఆటగాడు కనీసం 3 టెస్టులు లేదా 7 వన్డేలు ఆడాల్సిన అవసరం ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment