గడిచిన 9 ఏళ్లలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోడం అభిమానులు, ఆటగాళ్లను ఎంత బాధిస్తుందో బీసీసీఐని కూడా అంతే ఆవేదనకు గురి చేస్తుంది. ఈ విషయంలో భారత్ ఓ మోస్తరు జట్ల కంటే హీనంగా ఉండటాన్ని టీమిండియా ఫ్యాన్స్, బీసీసీఐ చిన్నతనంగా భావిస్తుంది.
వెస్టిండీస్, శ్రీలంక లాంటి జట్లు సైతం ఐసీసీ ట్రోఫీలు గెలవడంతో మెగా ఈవెంట్ల సందర్భంగా భారత అభిమానులు తలెత్తుకోలేకపోతున్నారు. భారత్ చివరి సారిగా 2013 ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. నాడు ధోని సారధ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్-2022 వరకు టీమిండియా ఆడిన ప్రతి ఐసీసీ టోర్నీలో రిక్త హస్తాలతో ఇంటిముఖం పట్టింది.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) జరుగబోయే వన్డే వరల్డ్‌కప్‌ను బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ఇందులో భాగంగా ఇప్పటినుంచే ప్రక్షాళనను మొదలుపెట్టింది. ఇప్పటికే సెలెక్షన్ కమిటీపై వేటు వేసిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. అతి త్వరలో టీ20 జట్టు నుంచి సీనియర్లను పూర్తిగా తప్పించి.. వన్డేలు, టెస్ట్‌లకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను టీ20 జట్టు నుంచి తప్పించి వన్డే, టెస్ట్‌లకు మాత్రమే పరిమితం చేయడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం శిఖర్ ధవన్‌ను వన్డేలకు మాత్రమే ఎలా వాడుకుంటున్నారో, రోహిత్‌ను కూడా మున్ముందు వన్డేల్లో మాత్రమే ఆడించాలని బీసీసీఐ యోచినట్లు తెలుస్తోంది.
గత కొంత కాలంగా రోహిత్.. టీ20ల్లో, టెస్ట్‌ల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోవడం, వయసు మీదపడటం, ఫిట్‌నెస్ కారణంగా చూపి కెప్టెన్‌పై వేటు వేసే అవకాశం ఉందని సమాచారం. రోహిత్‌ను వన్డేలకు మాత్రమే పరిమితం చేస్తే.. ఈ ఫార్మాట్‌పై అతను ఎక్కువ ఫోకస్ పెట్టి వరల్డ్‌కప్‌ను సాధించి పెట్టగలడని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బీసీసీఐ ప్లాన్‌లు ఎలా ఉన్నా అతి త్వరలో రోహిత్ విధుల్లో కోత పడటంతో పాటు ఏదో ఒకటి లేదా రెండు ఫార్మాట్లకు మాత్రమే పరిమతం కావడం ఖాయమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment