
టీమిండియా తరఫున 2007లోనే అరంగేట్రం చేశాడు రోహిత్ శర్మ (Rohit Sharma). ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు బ్యాటింగ్‌కు చేసే అవకాశమే రాలేదు. ఆ తర్వాత కూడా మిడిల్ ఆర్డర్‌లోనే అతడు ఆడాడు.
ఓపెనర్‌గా ప్రమోట్ చేసిన ధోని
అయితే, 2012 తర్వాత నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. రోహిత్ శర్మను టాపార్డర్‌కు ప్రమోట్ చేయించాడు. ఓపెనర్‌గా బరిలోకి దించాడు. ఆ తర్వాత రోహిత్ వెనుదిరిగి చూడలేదు. మూడు ఫార్మాట్లలో టీమిండియా ఓపెనర్‌గా పాతుకుపోయి.. కెప్టెన్ స్థాయికి ఎదిగాడు.
అంతేకాదు.. ధోని (3) తర్వాత భారత జట్టుకు అత్యధిక ఐసీసీ టైటిళ్లు అందించిన సారథిగా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. 2024లో టీ20 ప్రపంచకప్, 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపి ఈ ఘనత సాధించాడు. ఇక గతేడాదే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్.. ఇటీవలే టెస్టులకూ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇదిలా ఉంటే.. భారత టీ20 జట్టు ప్రస్తుతం ఆసియా కప్-2025 టోర్నమెంట్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023లో ఆసియా వన్డే కప్ సందర్భంగా రోహిత్ శర్మ గురించి ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) చేసిన వ్యాఖ్యలు తాజాగా మరోసారి వైరల్ అవుతున్నాయి.
ధోని చేసిన పని వల్లే.. రోహిత్ శర్మ ఇలా..
‘‘వన్డేల్లో పది వేల పరుగులు చేయడం అతడికి అంత తేలికగా సాధ్యం కాలేదు. కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడు. కెప్టెన్‌గా యువ ఆటగాళ్ల వెన్నుతట్టడంలో రోహిత్ ముందుంటాడు. కష్టకాలంలో వారికి అండగా నిలుస్తున్నాడు.
అయితే, ఈరోజు రోహిత్ శర్మ.. రోహిత్ శర్మగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి.. అతడు ఇలా ఉండటానికి ప్రధాన కారణం ఎంఎస్ ధోని. కెరీర్ ఆరంభంలో రోహిత్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నపుడు కూడా ధోని అతడికి పూర్తి స్థాయిలో అండగా నిలిచాడు.
ఇప్పుడు రోహిత్ కూడా యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ అదే బాటలో నడుస్తున్నాడు. కెప్టెన్‌గా తనదైన ముద్ర వేస్తున్నాడు’’ అని గంభీర్.. అటు ధోని.. ఇటు రోహిత్‌పై ఒకేసారి ప్రశంసల జల్లు కురిపించాడు.
రీ రీఎంట్రీకి సై
ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇప్పటి వరకు 273 మ్యాచ్లు పూర్తి చేసుకుని.. 11168 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు, మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక ద్విశతకాలు సాధించిన బ్యాటర్ రోహిత్ చరిత్ర పుటల్లో తన పేరు పదిలం చేసుకున్నాడు. తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అతడు మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.
చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు