ICC CWC 2023 Final- Ind vs Aus: ‘‘పన్నెండేళ్ల క్రితం (2011) ఫైనల్ ముందు రోజు ఏప్రిల్ ఫూల్స్ డేలో ఉన్నాం. బస చేసిన తాజ్ మహల్ హోటల్‌లో ఆటగాళ్లందరం నచ్చిన ఫుడ్ తింటూ సరదాగా గడిపాం. జోక్‌లతో ఆ రాత్రి గడిపాం. చక్కగా నిద్రపోయాం. ఏప్రిల్ 2న వాంఖడే స్టేడియంలోకి దిగగానే లోపల, బయట ఓ వేడుకే కనిపించింది. ఆటగాళ్లయితే ప్రశాంతంగా ఉన్నారు.
మెగా ఫైనల్‌లా కాకుండా మాకిది మరో మ్యాచ్ అన్నట్లుగానే మైండ్‌సెట్ చేసుకున్నాం. కోచ్ గ్యారీ కిర్‌స్టెన్, కెప్టెన్ ధోనిలకు ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఒత్తిడి పెంచకుండా ఉత్సాహంగా కేవలం మరో మ్యాచ్ కోసమే ఆడుతున్నట్లుగా సీన్ క్రియేట్ చేశారు.
నిజానికి క్వార్టర్ ఫైనల్లోనే ఆస్ట్రేలియాను ఓడించడంతోనే ఇక ఏ జట్టునైనా కంగుతినిపిస్తామన్న నైతిక బలం వచ్చేసింది. అందుకేనేమో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై ఫైనల్లో శ్రీలంకపై కొండంత ఒత్తిడున్నా దాన్ని అధిగమించాం. కప్‌ను జయించాం. ఇక ఇప్పడు అహ్మదాబాద్‌లో పూర్తిగా భిన్నమైన టీమిండియా ఫైనల్ పోరుకు సిద్ధమై ఉంది.
ఆస్ట్రేలియా ఎదురుగా ఉంది. రోహిత్ శర్మ నాయకత్వ పటిమకు ఇది సవాల్! భారత్ బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత పటిష్టమే కాదు ప్రత్యర్థి బౌలర్లకు దుర్బేధ్యంగా తయారైంది. ఇలాంటపుడు ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన 2003 ఫైనల్ ఓటమి గురించి ఆలోచించాల్సిన పనిలేదు.
పైగా ఇప్పటి శిక్షణ బృందంలో ఆనాడు ఫైనల్ ఆడిన రాహుల్ ద్రవిడ్ ఉండటం టీమిండియాకు సానుకూలాంశం. లోపాలను సరిదిద్ది, ఎత్తుగడలకు పదునుపెట్టడంలో ద్రవిడ్ మేధస్సు ఉపయోగపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ప్రేక్షకుల మద్దతు కొండంత బలమవుతుంది.
ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే... పూర్తిస్థాయి పేస్ దళం. స్లో వికెట్ అయినా రాణించగల సత్తా ఆసీస్ పేస్ బౌలర్లకు ఉంది. అలాగే లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా రూపంలో నాణ్యమైన స్పిన్నర్ కూడా అందుబాటులో ఉండటం... అతనీ ప్రపంచకప్‌లో నిలకడగా రాణిస్తుండటంతో అతని పాత్ర కూడా అంతిమ సమరంలో కీలకం కానుంది.
వన్డే ప్రపంచకప్ ట్రోఫీని అందుకుంటే ఆ ఆనందం ఎలా ఉంటుందో విరాట్ కోహ్లి, అశ్విన్‌లకు తెలుసు. గత రెండు ప్రపంచకప్‌లలో రోహిత్ శర్మ, షమీ ట్రోఫీని అందుకోవడానికి రెండు విజయాల దూరంలో ఉండిపోయారు.
ఈసారి మాత్రం ఒక్క విజయం సాధిస్తే ట్రోఫీని ఎత్తుకుంటామన్న సంగతి వారికి కూడా తెలుసు’’ అని టీమిండియా మాజీ బ్యాటర్, వన్డే వరల్డ్‌కప్-2011 విజేత గౌతం గంభీర్ అన్నాడు. టీమిండియా- ఆస్ట్రేలియా ఫైనల్ పోరులో తలపడనున్న తరుణంలో ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా అహ్మదాబాద్‌లోని నర్రేంద మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment