వన్డే వరల్డ్‌కప్-2011.. జట్టులో చోటే కరువు.. 2023లో ఏకంగా కెప్టెన్‌గా బరిలోకి.. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌లు గెలిపించిన నాయకుడిగా సరికొత్త గుర్తింపు.. అజేయంగా నిలిచి ఫైనల్ వరకు ప్రయాణం.. ఆ ఒక్క అడ్డంకి దాటేస్తే.. ప్రపంచకప్ గెలిచిన మూడో కెప్టెన్‌గా చరిత్ర పుటల్లో నిలిచే సువర్ణావకాశం.. అవును.. రో‘హిట్’ శర్మ గురించే ఇదంతా!!
ఒకప్పుడు ప్రపంచకప్ జట్టులో చోటే లేని ఆటగాడు ఇప్పుడు సారథిగా జట్టును ముందుండి నడిపిస్తూ టైటిల్ గెలిచేందుకు సంసిద్ధమయ్యాడు. 1983లో కపిల్ దేవ్, 2011లో మహేంద్ర సింగ్ ధోని చేసిన అద్భుతాలను పునరావృతం చేసేందుకు సన్నద్ధమయ్యాడు. భావోద్వేగాలపరంగా యావత్ భారతానికి ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమో.. నాయకుడిగా రోహిత్‌కు, జట్టుకు అంతే ముఖ్యం. హిట్‌మ్యాన్ కూడా ఇదే మాట అంటున్నాడు.
మ్యాచ్ గెలిస్తే మంచిదే
‘‘భావోద్వేగాలపరంగా చూస్తే ఇది చాలా పెద్ద క్షణం అనడంలో సందేహం లేదు. ఫైనల్ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో నాకు బాగా తెలుసు. కఠోర శ్రమ తర్వాత ఇక్కడి వరకు వచ్చాం. అయితే ఈరోజు ఎంతో ప్రత్యేకమనే ఆలోచనను పక్కన పెట్టి నాతో పాటు మిగతా సహచరులంతా ఆటపై మాత్రమే దృష్టి పెట్టడం అవసరం. మ్యాచ్ గెలిస్తే మంచిదే కానీ అనవసరంగా ఒత్తిడి పెంచుకోను.
అది ఇప్పుడు అనవసరం
ఈ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించా. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి బాగా ఆడటం ముఖ్యం. డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ప్రశాంతంగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాం. మ్యాచ్ రోజున పిచ్‌ను చూసిన తర్వాతే ఏం చేయాలనేది నిర్ణయిస్తాం. 2011లో నాకు ఏం జరిగిందనేది ఇప్పుడు అనవసరం.
కానీ ఈ వయసులో ఫైనల్ మ్యాచ్‌కు సారథిగా వ్యవహరించడం సంతోషంగా ఉంది. ఇది సాధ్యమవుతుందని నేనెప్పుడూ ఊహించలేదు’’ అంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు.
1983లో కపిల్ డెవిల్స్
భారత క్రికెట్ రూపురేఖలను మార్చిన ఏడాది.. అప్పటివరకు అడపా దడపా క్రికెట్ మ్యాచ్‌లు చూసిన సందర్భాలే తప్ప ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడైతే కపిల్ డెవిల్స్ జగజ్జేతగా నిలిచిందో అప్పటి నుంచి టీమిండియా భవిష్యత్తు మారిపోయింది. భారత్ క్రికెట్‌లో నూతన శకం మొదలైంది.
అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన జట్టు ఏకంగా ట్రోఫీని ముద్దాడటం అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్నీ ఆశ్చర్యపరిచింది. అయితే.. ఇంగ్లండ్ వేదికగా ఈ ప్రపంచకప్ టోర్నీ ప్రయాణం భారత్‌కు నల్లేరు మీద నడకలా సాగలేదు.
అనూహ్యరీతిలో విండీస్‌ను చిత్తు చేసి
లీగ్ దశలో అనూహ్య రీతిలో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను 34 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు.. తర్వాత జింబాబ్వేతో మ్యాచ్‌లో 135 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో 162 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది కపిల్ బృందం. అయితే పడిలేచిన కెరటంలా దూసుకొచ్చి మరోసారి విండీస్‌కు షాకిచ్చి 66 పరుగుల తేడాతో గెలిచింది మళ్లీ విజయాల బాట పట్టింది.
ఆ తర్వాత జింబాబ్వేను 31 రన్స్‌తో ఓడించిన టీమిండియా ఆస్ట్రేలియాపై కూడా ప్రతీకారం తీర్చుకుంది. 118 పరుగుల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించి జయకేతనం ఎగురవేసి సెమీస్‌కు చేరింది.
సెమీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి
సెమీ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను మట్టికరిపించి సత్తా చాటి ఫైనల్‌కు చేరింది. అయినప్పటికీ టీమిండియాను తక్కువ చేసి మాట్లాడిన వారే ఎక్కువ. అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచి వెస్టిండీస్ వరుసగా మూడోసారి ఫైనల్ చేరడంతో కపిల్ సేనను మట్టికరిపించడం ఖాయమని భావించారు. కానీ.. అందరి అంచనాలు తలకిందులయ్యాయి. సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది టీమిండియా. కపిల్ దేవ్ దూకుడైన విధానం, చావో రేవో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించే తీరు భారత్‌కు తొలి టైటిల్ అందించింది.
మిస్టర్ కూల్ ధోని సేన సొంతగడ్డపై
ఇక 2011లో ఏం జరిగిందో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బంగ్లాదేశ్‌పై (87 పరగుల తేడాతో) గెలుపుతో ఆరంభించిన ధోని సేన.. తర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ను టై చేసుకుంది.
ఆ తర్వాత.. పసికూనలు ఐర్లాండ్, నెదర్లాండ్స్‌లను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. అనంతరం సౌతాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో గెలిచింది. అటు పిమ్మట వెస్టిండీస్‌ను 80 పరుగుల తేడాతో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి సెమీస్ చేరింది. ఇక మొహాలీలో జరిగిన రెండో సెమీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 29 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో శ్రీలంకను చిత్తు చేసి మిస్టర్ కూల్ ధోని జట్టు ట్రోఫీని ముద్దాడిన దృశ్యాలను అభిమానులెవరు మర్చిపోగలరు!!
Comments
Please login to add a commentAdd a comment