ఇంగ్లండ్ వన్డే వరల్డ్‌కప్ హీరో, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటన అభిమానులను విస్మయానికి గురిచేసింది. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరగనున్న తొలి వన్డే తనకు ఆఖరి మ్యాచ్ అని స్టోక్స్ తెలిపాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించాడు. "మూడు ఫార్మాట్లలో ఆడటం నాకు చాలా కష్టంగా ఉంది.
తీరిక లేని షెడ్యూల్ కారణంగా మూడు ఫార్మాట్లలో ఆడటానికి నా శరీరం సహకరించడం లేదు. అదే విధంగా వన్డే ఫార్మాట్లో వంద శాతం న్యాయం చేయలేపోతున్నాను. కాబట్టి నా స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాను. మరో ఆటగాడు నాలాగే ఇంగ్లండ్ క్రికెట్‌తో అపురూపమైన జ్ఞాపకాలను సృష్టించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
కాబట్టి నా 11 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలకాలి అని అనుకుంటునున్నాను. ఇకపై నా దృష్టింతా టెస్టు క్రికెట్‌పై పెట్టాలని భావిస్తున్నా" అని స్టోక్స్ తన రిటైర్మెంట్ నోట్‌లో రాసుకొచ్చాడు. కాగా స్టోక్స్ 31 ఏళ్ల వయస్సులోనే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై ప్రస్తుతం తెగ చర్చ నడుస్తోంది.
మూడు ఫార్మాట్లలో ఆడటం వల్ల ప్లేయర్ శరీరంపై భారం పడుతుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో చాలా మంది స్టార్ ఆటగాళ్లు వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటారని మాజీలు, క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐసీసీ, ఆయా దేశ క్రికెట్ బోర్డులకు స్టోక్స్ రిటైర్మెంట్ ఒక హెచ్చరిక వంటిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టోక్స్ వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవడానికి గల నాలుగు కారణాలను పరిశీలిద్దాం.
బిజీ బిజీ షెడ్యూల్.. అధిక ఒత్తిడి
రాబోయే రోజుల్లో ఐసీసీ అనేక టోర్నమెంట్లను నిర్వహించనుంది. ఫ్యూచర్ టూర్ పోగ్రామ్(2020-2023)లో భాగంగా క్యాలెండర్‌ను ముందుగానే సిద్దం చేస్తుంది. దీంతో ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు టీ 20 ఫ్రాంఛైజీ లీగ్‌లకు కూడా ప్రాధాన్యత పెరుగుతోంది. కాబట్టి ఆటగాళ్లకు విశ్రాంతి తీసుకునే సమయమే దొరకడం లేదు.
చాలా మంది ఆటగాళ్ళు వన్డేలకు విడ్కోలు..!
ప్రస్తుత బిజీ షెడ్యూల్ వల్ల రాబోయే రోజుల్లో మరింత మంది ఆటగాళ్లు వన్డేలకు గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే విషయాన్ని తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ప్రస్తావించాడు. ప్రస్తుత ఐసీసీ షెడ్యూల్‌ను సవరించకపోతే చాలా మంది ఆటగాళ్లు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అశూ అన్నాడు. కాగా ఈ ఫిక్స్‌డ్ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు ఒక ఫార్మాట్‌పై దృష్టి సారించడానికి మరో ఫార్మాట్‌కు దూరంగా ఉన్న ఉదాహరణలు గతంలో చాలానే ఉన్నాయి.
టీ20 క్రికెట్ పెరగడం వల్ల వన్డేలకు గుడ్‌బై
గత కొన్ని ఏళ్లుగా టీ20 క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరగడంతో వన్డే క్రికెట్ ఔచిత్యాన్ని కోల్పోతోంది. చాలా మంది ఆటగాళ్లు టీ20 కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కాబట్టి వన్డే, టెస్టు ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఐపీఎల్, బీబీఎల్, సీపీఎల్ వంటి టీ20 ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌ల వల్ల కూడా ఆటగాళ్లకు వన్డే క్రికెట్‌పై మక్కువ పోతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఆటగాళ్లపై ఐసీసీ వన్డే సూపర్ లీగ్ ప్రభావం
ప్రస్తుతం ప్రపంచ కప్ అర్హత ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌పై ఆధారపడి ఉంది. వన్డే సూపర్ లీగ్‌లో ర్యాంకింగ్‌లు, అర్హతలను నిర్ణయించడానికి ఐసీసీ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ముందుగానే ప్రీ షెడ్యూల్ చేస్తుంది. మొదటి 8 స్థానాల్లో నిలిచిన జట్లు వన్డే ప్రపంచ కప్-2023కు నేరుగా అర్హత సాధిస్తాయి. కాబట్టి టాప్ 8లో నిలిచి వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాలని అన్ని జట్లు భావిస్తున్నాయి.
స్వదేశంలోనే కాకుండా విదేశీ పర్యటనలలో కూడా జట్లు బిజీ బిజీ గడుపుతున్నాయి. ఈ క్రమంలో ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది ఆటగాళ్లు తమ ఆరోగ్యం దృష్ట్యా వన్డేలకు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్టోక్స్ సైతం ఈ అనూహ్య నిర్ణయం తీసుకుని ఉంటాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
చదవండి: Virat Kohli: ఒక్క 20 నిమిషాలు చాలు.. కోహ్లి సమస్యను పరిష్కరిస్తా! నేను కూడా ఆ ఇబ్బంది ఎదుర్కొన్నా!
❤️🏴 pic.twitter.com/xTS5oNfN2j
— Ben Stokes (@benstokes38) July 18, 2022
Comments
Please login to add a commentAdd a comment