ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. బజ్‌బాల్ క్రికెట్‌తో దూకుడు ప్రదర్శిస్తున్న ఆ జట్టుకు ఆసీస్ ముకుతాడు వేసింది. అయితే మ్యాచ్ ఓటమిపై స్టోక్స్ తనదైన శైలిలో స్పందించాడు. మ్యాచ్ ఓడిపోయామన్న బాధ ఉన్నా బజ్‌బాల్ క్రికెట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ పేర్కొన్నాడు.
''మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు.. కానీ ఒక విషయంలో సంతోషంగా ఉంది. అదేంటంటే మ్యాచ్‌ను ఆఖరి నిమిషం వరకు తీసుకెళ్లడం. ఒక గొప్ప గేమ్‌లో భాగస్వామ్యం కావడం.. మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు కూడా ఐదురోజుల పాటు ఎడ్జ్ ఆఫ్ సీట్ ఫీల్‌ను అనుభవించారు. ఒక టెస్టు క్రికెట్‌కు కావాల్సింది ఇదే. యాషెస్‌ను ఇరుదేశాల్లో ఎంతలా ఆదరిస్తానేది మరోసారి కనిపించింది.
మ్యాచ్‌లో ఎవరో ఒకరే గెలవాలి..ఇవాళ మేం ఓటమి డెడ్‌లైన్‌ను దాటలేకపోయాం. అంతమాత్రానా మా ఆటతీరును మార్చుకోలేం. బజ్‌బాల్ క్రికెట్‌ను కంటిన్యూ చేస్తాం. ఈ మ్యాచ్‌లో మా వ్యూహాలను ఎదుర్కోవాలనే ప్లాన్‌తో ఆసీస్ వచ్చింది. మేం జస్ట్ మిస్ అయ్యాం. లేదంటే ఇక్కడ వేరే ఫలితం గురించి మాట్లాడుకునేవాళ్లం. ఈ సిరీస్‌లో ఇది తొలి మ్యాచ్ మాత్రమే. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలిఉన్నాయి. చాలా క్రికెట్ ఆడాలి. ఇప్పుడు మా ఫోకస్ అంతా ఆ మ్యాచ్‌లపైనే.
చేతిలో వికెట్లు ఉండి కూడా మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ను తొలిరోజే డిక్లేర్ చేయడం వెనుక నాది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. ఈరోజు దీనికి క్లారిటీ ఇస్తున్నా. నేను ఒక కెప్టెన్‌ను కాబట్టి.. ఆ టైంలో ఆస్ట్రేలియాను మరింత ఒత్తిడిలోకి నెట్టొచ్చు అనిపించింది. అందుకే ఆ పని చేశా. ఏ ఓపెనింగ్ బ్యాటర్ కూడా ఆట ముగియడానికి 20 నిమిషాల ముందు బ్యాటింగ్‌కు వెళ్లాలని అనుకోడు. అందుకే ఆ పని చేశా. అయితే ఆ రోజు ఆసీస్ ఓపెనర్లు ఇద్దరూ ఎలాంటి పొరపాటు చేయకుండా తొలి రోజు ఆటను ముగించారు.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయినా కూడా.. ఇంగ్లండ్‌కు కేవలం 7 పరుగుల ఆధిక్యమే లభించింది. అదే ఇంగ్లండ్ కనుక తొలి రోజు డిక్లేర్ చేయకుండా మరికొంత సమయం ఆడి ఉంటే మరింత ఆధిక్యం లభించేదే. మేం ఆడిన విధానం, ఆసీస్ బౌలర్లపై ఎదురు దాడి చేయడం చూసి డిక్లేర్ చేయాలనే నిర్ణయం తీసుకున్నా. డిక్లేర్ చేయకపోతే ఐదో రోజు ఇంత ఎగ్జయిట్‌మెంట్ వచ్చేదా? చెప్పండి'' అంటూ ప్రశ్నించాడు.
మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించిన ఆస్ట్రేలియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్ వేదికగా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment