బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 7:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంటుంది.
మూడో స్థానానికి చేరనున్న విరాట్
ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ సిరీస్‌లో విరాట్ మరో 350 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లు) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకతాడు. ప్రస్తుతం సచిన్, సంగక్కర, పాంటింగ్ విరాట్ కంటే ముందున్నారు. ఈ సిరీస్‌లో విరాట్ 350 పరుగులు చేస్తే పాంటింగ్ అధిగమించి మూడో స్థానాన్ని ఆక్రమిస్తాడు.
బుమ్రా మరో 27 వికెట్లు తీస్తే..!
బీజీటీలో బుమ్రా మరో 27 వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత్ పేసర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం భారత్ తరఫున కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, మొహమ్మద్ షమీ 200 వికెట్ల క్లబ్‌లో ఉన్నారు.
బుమ్రా ఈ సిరీస్‌లో 27 వికెట్లు తీస్తే వేగంగా 200 వికెట్ల మైలురాయిని తాకిన భారత పేసర్‌గానూ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ 50 టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీయగా.. బుమ్రా ప్రస్తుతం 40 టెస్ట్‌లు మాత్రమే ఆడాడు.
కోచ్ రికార్డునే గురి పెట్టిన జైస్వాల్
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికార్డుకే గురి పెట్టాడు. బీజీటీలో జైస్వాల్ మరో 15 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు గంభీర్ (1134 పరుగులు) పేరిట ఉంది.
బీజీటీలో యశస్వి మరో 444 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ 2010లో 1562 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment