బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును గాయాల బెడద వేధిస్తూ ఉంది. కాలి మడమ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఇప్పటికే సిరీస్ మొత్తానికి దూరంగా కాగా.. తాజాగా మరో ఆసీస్ వికెట్ పడినట్లు తెలుస్తోంది. రెండో టెస్ట్ సందర్భంగా మోచేతి గాయం బారిన పడిన డేవిడ్ వార్నర్.. తదుపరి జరిగే మూడు, నాలుగు టెస్ట్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం.
వార్నర్‌కు తగిలిన గాయం చాలా తీవ్రమైందని, అతని ఎల్బో ఫ్రాక్చర్ అయ్యిందని తెలుస్తోంది. ఇదే జరిగి ఉంటే వార్నర్ తదుపరి సిరీస్‌కు అందుబాటులో ఉండటం దాదాపుగా అసాధ్యం. ఈ విషయంపై ఆసీస్ మేనేజ్‌మెంట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. వార్నర్ స్థానంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ జట్టులో చేరతాడనే ప్రచారం జరుగుతుంది. మూడో టెస్ట్ ప్రారంభానికి మరో 9 రోజుల సమయం ఉన్నందున, ఈ లోపు మ్యాక్సీ జట్టుతో చేరతాడని వార్తాలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే కాలి ఫ్రాక్చర్ నుంచి పూర్తిగా కోలుకున్న మ్యాక్సీ.. ఫిట్‌నెస్ టెస్ట్‌లో కూడా పాసయ్యాడని, టీమిండియాతో జరిగే వన్డే సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయాలని ఆసీస్ మేనేజ్‌మెంట్ భావిస్తుందని, ఈ మధ్యలో వార్నర్ గాయపడటంతో మ్యాక్సీ కాస్త ముందుగానే భారత్‌లో అడుగుపెడతాడని సమాచారం. మరోవైపు వ్యక్తిగత కారణాల చేత ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఉన్నపళంగా స్వదేశానికి పయనమైన విషయం తెలిసిందే.
మూడో టెస్ట్ ప్రారంభమయ్యే లోపు కమిన్స్ తిరిగి జట్టులో చేరతాడని ఆసీస్ యాజమాన్యం చెబుతున్నప్పటికీ.. ఈ విషయంలో కూడా గ్యారెంటీ లేదని తెలుస్తోంది. కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్ కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడని సమాచారం. ఇంకోవైపు మూడో టెస్ట్‌కు మిచెల్ స్టార్క్, కెమరూన్ గ్రీన్‌ల సన్నద్ధతపై కూడా ఆసీస్ మేనేజ్‌మెంట్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. వీరి ఫిట్‌నెస్ పరిస్థితి ఎలా ఉందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆసీస్ మున్ముందు ఎలా నెట్టుకొస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment