BGT 2023: India Vs Australia 3rd Test Match 2023 Day 1 Live Updates In Telugu - Sakshi
Sakshi News home page

IND VS AUS 3rd Test Day 1: 109 పరుగులకే టీమిండియా పతనం.. అనంతరం రవీంద్రుని మాయాజాలం

Published Wed, Mar 1 2023 9:15 AM | Last Updated on Wed, Mar 1 2023 5:02 PM

BGT 2023: India Vs Australia 3rd Test Match Live Updates-Highlights - Sakshi

Ind Vs Aus 3rd Test Indore Updates Day 1:

109 పరుగులకే టీమిండియా పతనం.. అనంతరం రవీంద్రుని మాయాజాలం
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.  హ్యాండ్స్‌కోంబ్‌ (7), కామెరాన్‌ గ్రీన్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ కోల్పోయిన 4 వికెట్లు జడేజా ఖాతాలోనే వెళ్లాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 109 పరగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. కుహ్నేమన్‌ (5/16) టీమిండియా బ్యాటింగ్‌  లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్‌ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. విరాట్‌ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

48.5: నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(26) జడేజా బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. 

42.3: చెలరేగిన జడేజా
పట్టుదలగా నిలబడి అర్ధ శతకం పూర్తి చేసుకుని ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా(60)ను జడ్డూ పెవిలియన్‌కు పంపాడు. ఆసీస్‌ స్కోరు: 125/3 (43). స్టీవ్‌ స్మిత్‌, హ్యాండ్స్‌కోంబ్‌ క్రీజులో ఉన్నారు.

34.3: రెండో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
జడేజా బౌలింగ్‌లో లబుషేన్‌(31) బౌల్డ్‌

మన వాళ్లు అలా.. వీళ్లు ఇలా
ఆసీస్‌ స్పిన్నర్ల ధాటికి.. భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టిన చోట..  ఆస్ట్రేలియా బ్యాటర్లు మాత్రం ఫర్వాలేదనిపిస్తున్నారు. ఖావాజ(46) అర్ధ శతకం దిశగా పయనిస్తుండగా.. లబుషేన్‌(22) అతడికి తోడుగా నిలబడ్డాడు. వీరిద్దరు నిలకడగా బ్యాటింగ్‌ చేస్తుండటంతో వికెట్లు తీయడం భారత బౌలర్లకు కష్టంగా మారింది. 27 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు: 90-1. 

20 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 60-1
ఉస్మాన్‌ ఖవాజా(27), మార్నస్‌ లబుషేన్‌ (15) పట్టుదలగా నిలబడ్డారు. దీంతో వికెట్లు తీయడం భారత స్పిన్నర్లకు కష్టంగా మారింది.

18 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు 56/1
18 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్‌ నష్టానికి 56 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా 25, లబుషేన్‌ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

9 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు 35/1
9 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖవాజా 14, లబుషేన్‌ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మొదలైన వికెట్ల వేట.. తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
ఇండోర్‌ వేదికగా​జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తన వికెట్ల వేటను ఆరంభించింది. 109 పరుగులకే ఆలౌట్‌ చేశామని సంబరపడిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. 9 పరుగులు చేసిన ట్రెవిస్‌ హెడ్‌ జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్‌ వికెట్‌ నష్టానికి 12 పరుగులు చేసింది.

కుహ్నెమన్‌ పాంచ్‌ పటాకా.. 109 పరుగులకే టీమిండియా ఆలౌట్‌
ఇండోర్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా 109 పరుగులకే ఆలౌట్‌ అయింది. మహ్మద్‌ సిరాజ్‌ రనౌట్‌ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆసీస్‌ స్పిన్నర్లు కుహ్నెమన్‌, నాథన్‌ లియోన్‌, టాడ్‌ మర్ఫీ ధాటికి టీమిండియా బ్యాటర్లు నిలవలేకపోయారు. పిచ్‌పై బంతి అనూహ్యంగా టర్న్‌ అవుతుండడంతో ఎలా ఆడాలో తెలియక బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు. కోహ్లి 22 పరుగులు చేయగా.. గిల్‌ 21 పరుగులు చేశాడు. కుహ్నెమన్‌ ఐదు వికెట్లు తీయగా.. లియోన్‌ 3, మర్ఫీ ఒక వికెట్‌ పడగొట్టాడు.

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
ఉమేశ్‌ యాదవ్‌(17 పరుగులు) రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్‌ నష్టపోయింది. కుహ్నెమన్‌ ఐదు వికెట్లతో మెరిశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 9 వికెట్ల నష్టానికి 108గా ఉంది.

ఉమేశ్‌ యాదవ్‌ జోరు.. వంద దాటిన టీమిండియా స్కోరు
టీమిండియా బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా వంద పరుగుల మార్క్‌ను దాటింది. రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఉమేశ్‌ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా 8 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ 11 పరుగులతో ఆడుతున్నాడు.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
లంచ్‌ విరామం అనంతరం టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. మూడు పరుగులు చేసిన అశ్విన్‌ కుహ్నెమన్‌ బౌలింగ్‌లో కీపర్‌ అలెక్స్‌ కేరీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 8 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. 

లంచ్‌ విరామం.. ఏడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
మూడో టెస్టులో భాగంగా తొలి రోజు ఆటలో తొలి సెషన్‌ ముగిసింది. తొలి సెషన్‌లో ఆసీస్‌ పూర్తి ఆధిపత్యం చూపించింది. పిచ్‌పై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకున్న ఆసీస్‌ స్పిన్నర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. ఇక లంచ్‌ విరామ సమయానికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ 6 పరుగులు, అశ్విన్‌ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

స్పిన్నర్ల మాయాజాలం.. ఏడో వికెట్‌ డౌన్‌
25: ఆసీస్‌ స్పిన్నర్ల మాయాజాలం కొనసాగుతుంది. పిచ్‌పై బంతి ఎలా టర్న్‌ అవుతుందో అర్థంగాక టీమిండియా బ్యాటర్లు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా నాథన్‌ లియోన్‌ బౌలింగ్‌లో శ్రీకర్‌ భరత్‌(17 పరుగులు) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 82 పరుగులు వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది.  

21.4: కోహ్లి(22) ఔట్‌.. ఆరో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
ఆసీస్‌ స్పిన్నర్ల దెబ్బకు టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. తాజాగా 22 పరుగులు చేసిన కోహ్లి టాడ్‌ మర్ఫీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 70 పరుగుల వద్ద ఆరో వికెట్‌ నష్టపోయింది. శ్రీకర్‌ భరత్‌ 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

రివ్యూ కోల్పోయిన ఆసీస్‌.. టీమిండియా 66/5
17 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. కోహ్లి 19, శ్రీకర్‌ భరత్‌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆస్ట్రేలియా తమ రివ్యూను కోల్పోయింది. లయోన్‌ బౌలింగ్‌లో భరత్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి ప్యాడ్లను తాకింది. దీంతో అప్పీల్‌కు వెళ్లగా అంపైర్‌ ఔటివ్వలేదు. ఆసీస్‌ రివ్యూ కోరింది. రిప్లేలో బంతి లెగ్‌స్టంప్‌  పక్కకు వెళుతుండడంతో భరత్‌ నాటౌట్‌ అని ప్రకటించాడు.

11.2: ఐదో వికెట్‌ డౌన్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు షాకుల మీద షాకులు తలుగుతున్నాయి. ఆది నుంచే ఆసీస్‌ స్పిన్నర్లు తిప్పేయడంతో రోహిత్‌ సేన ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుహ్నెమన్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌(0) బౌల్డ్‌ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. కోహ్లి (7), కేఎస్‌ భరత్‌ క్రీజులో ఉన్నారు.

10.4: నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
నాథన్‌ లియోన్‌ మరోసారి టీమిండియాను దెబ్బకొట్టాడు. జడేజా(4)ను పెవిలియన్‌కు పంపి భారీ షాకిచ్చాడు. కుహ్నెమన్‌కు క్చాచ్‌ ఇచ్చి నాలుగో వికెట్‌గా జడ్డూ వెనుదిరిగాడు. కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులో ఉన్నారు.

ఆసీస్‌ స్పిన్నర్ల దూకుడు.. మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
8.2: నాథన్‌ లియోన్‌ బౌలింగ్‌లో పుజారా(1) బౌల్డ్‌
ఆస్ట్రేలియా స్పిన్నర్ల ధాటికి టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. ఇప్పటికే కుహ్నెమన్‌ రోహిత్‌, గిల్‌ వికెట్లు కూల్చగా.. సీనియర్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ను పుజారాను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆరంభంలోనే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. స్కోరు:  40-3(9).

7.2: మరోసారి దెబ్బ కొట్టిన ఆసీస్‌ స్పిన్నర్‌
►ఆసీస్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మాథ్యూ కుహ్నెమన్‌ మరోసారి టీమిండియాను దెబ్బకొట్టాడు. తొలుత కెప్టెన్‌ రోహిత్‌ను పెవిలియన్‌కు పంపిన అతడు.. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌(21) వికెట్‌ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. విరాట్‌ కోహ్లి(1), పుజారా(1) క్రీజులో ఉన్నారు. స్కోరు: 35-2(8).

5.6: తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
►కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(12) రూపంలో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది.  కుహ్నెమన్‌ బౌలింగ్‌లో అలెక్స్‌ క్యారీ అద్భుత స్టంపింగ్‌ కారణంగా రోహిత్‌ నిష్క్రమించకతప్పలేదు. గిల్‌(15), పుజారా క్రీజులో ఉన్నారు.

►రోహిత్‌ శర్మకు జోడీగా శుబ్‌మన్‌ గిల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 3 ఓవర్లలో స్కోరు 14-0.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా
ఇండోర్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఏంచుకుంది. ముందుగా ఊహించినట్లుగా కేఎల్‌ రాహుల్‌ స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌ తుది జట్టులోకి రాగా.. వర్క్‌లోడ్‌ కారణంగా షమీకి విశ్రాంతినిచ్చి అతని స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు.

ఈ రెండు మార్పులు మినహా తొలి రెండు టెస్టులు ఆడిన జట్టే బరిలోకి దిగుతుంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా రెండు మార్పులు చేసింది. వ్యక్తిగత కారణాలతో మూడో టెస్టుకు దూరమైన పాట్‌ కమిన్స్‌ స్థానంలో మిచెల్‌ స్టార్క్‌ రాగా.. డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో కామెరున్‌ గ్రీన్‌ తుది జట్టులోకి వచ్చాడు. 

తుది జట్లు 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్), గిల్‌, పుజారా, కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్, జడేజా, శ్రీకర్‌ భరత్, అశ్విన్, అక్షర్, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌

ఆస్ట్రేలియా: స్మిత్‌ (కెప్టెన్), హెడ్, ఉస్మాన్‌ ఖాజా, లబుషేన్, హ్యాండ్స్‌కాంబ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, మర్ఫీ , లయన్, కున్‌మన్‌

పిచ్‌–వాతావరణం 
ఇండోర్‌ పిచ్‌ ఆరంభంలో పేస్‌కు అనుకూలిస్తుంది. మూడో రోజు స్పిన్‌కు టర్న్‌ అవుతుంది. 2016లో న్యూజిలాండ్, 2019లో బంగ్లాదేశ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఇదే జరిగింది. వేసవి వేడి మొదలవడంతో వాన ముప్పేమీ లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement