ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా నామమాత్రపు స్కోరు చేసింది. టాపార్డర్ వైఫల్యం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. కీలక ఆటగాళ్లంతా విఫలమైన చోట.. అరంగేట్ర ఆటగాడు, ఆంధ్ర యువ క్రికెటర్ నితీశ్ రెడ్డి భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం.
జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాగా.. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా నితీశ్ కుమార్‌రెడ్డి, హర్షిత్ రాణా టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశారు.
ఇక పెర్త్ టెస్టులో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్(26) కాసేపు పట్టుదలగా నిలబడ్డాడు. కానీ అనూహ్యంగా వివాదాస్పద రీతిలో అతడు అవుట్ అయ్యాడు. మరోవైపు.. వన్‌డౌన్‌లో వచ్చిన పడక్కిల్ సున్నా చుట్టగా.. విరాట్ కోహ్లి ఐదు పరుగులకే నిష్క్రమించాడు.
రాణించిన రిషభ్ పంత్
ఈ క్రమంలో మిడిలార్డర్‌లో రిషభ్ పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 78 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మూడు ఫోర్లతో పాటు తనదైన ట్రేడ్ మార్క్ సిక్సర్ సాయంతో 37 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో ధ్రువ్ జురెల్(11), వాషింగ్టన్ సుందర్(4) నిరాశపరచగా.. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ రెడ్డి అద్బుతంగా ఆడాడు.
నితీశ్ రెడ్డి ధనాధన్
టెస్టుల్లో అదీ ఆసీస్ గడ్డపై అరంగేట్రం చేసిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేవలం 59 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. నితీశ్ రెడ్డి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. అయితే, ఆసీస్ సారథి, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో తన కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో నితీశ్ ఇన్నింగ్స్‌తో పాటు టీమిండియా ఇన్నింగ్స్‌కూ తెరపడింది.
ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నితీశ్ రెడ్డి.. 49.4వ ఓవర్ వద్ద.. కమిన్స్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజాకు క్యాచ్ ఇచ్చి.. పదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇక మిగిలిన వాళ్లలో హర్షిత్ రాణా 7, బుమ్రా 8 పరుగులు చేయగా.. మహ్మద్ సిరాజ్ 0 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఆసీస్ పేసర్లలో జోష్ హాజిల్‌వుడ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కమిన్స్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్ తలా రెండు వికెట్లు కూల్చారు.
చదవండి: చెత్త అంపైరింగ్.. కేఎల్ రాహుల్ అసంతృప్తి.. మండిపడుతున్న మాజీ క్రికెటర్లు
Comments
Please login to add a commentAdd a comment