‘నితీశ్‌ రెడ్డికి చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో చోటు ఇవ్వాల్సిందే’ | Big Surprises As Gavaskar Irfan Pathan Announce Their CT 2025 Indian Team | Sakshi
Sakshi News home page

‘నితీశ్‌ రెడ్డికి చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో చోటు ఇవ్వాల్సిందే.. ఎందుకంటే’

Published Mon, Jan 13 2025 4:09 PM | Last Updated on Mon, Jan 13 2025 4:33 PM

Big Surprises As Gavaskar Irfan Pathan Announce Their CT 2025 Indian Team

భారత క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం చర్చంతా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ(ICC Champions Trophy 2025) గురించే!.. ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే టీమిండియాలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే ప్రాథమిక జట్లను ప్రకటించడానికి సోమవారమే(జనవరి 13) ఆఖరి తేదీ అయినా.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)ని మరింత గడువు కోరింది.

ఇందుకు ఐసీసీ నుంచి సానుకూల స్పందన రాగా.. జనవరి 18 లేదా 19న చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనబోయే భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌, భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసి ఈ మెగా టోర్నీకి తమ జట్టును ఎంచుకున్నారు.

కెప్టెన్‌కు నో ఛాన్స్‌!
టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav)కు ఈ వన్డే ఫార్మాట్‌ జట్టులో గావస్కర్‌, పఠాన్‌ చోటివ్వలేదు. అయితే, అనూహ్యంగా ‘అన్‌క్యాప్డ్‌’ ప్లేయర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిని మాత్రం తమ టీమ్‌లో చేర్చారు. ఈ విషయం గురించి స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో గావస్కర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇటీవలి కాలంలో వన్డేల్లో ఎవరు అదరగొట్టారో వారిని మాత్రమే నేను ఎంచుకుంటాను. వన్డే ప్రపంచకప్‌-2023లో కేఎల్‌ రాహుల్‌ అద్భుతంగా రాణించాడు.

సంజూను ఎలా కాదనగలం?
ఇక శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. అతడు కూడా ప్రపంచకప్‌ టోర్నీలో మునుపెన్నడూ లేనివిధంగా దుమ్ములేపాడు. కాబట్టి తనకు సెలక్టర్లు మద్దతుగా నిలవాలి. గత కొన్ని నెలలుగా అతడు జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఫామ్‌లో ఉన్నా సరే అతడికి సెలక్టర్ల నుంచి పిలుపురావడం లేదు.

నా అభిప్రాయం ప్రకారం వీరిద్దరికి కచ్చితంగా చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడే జట్టులో చోటివ్వాలి. నాలుగో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌, ఐదో స్థానంలో కేఎల్‌ రాహుల్‌ను ఆడించాలి. ఆరో స్థానంలో రిషభ్‌ పంత్‌ ఆడాలి. ఇక సంజూ శాంసన్‌ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌(టీ20)లో వరుస శతకాలు సాధించాడు. అలాంటి ఆటగాడిని మనం ఎలా విస్మరించగలం?’’ అని పేర్కొన్నాడు.

నితీశ్‌ రెడ్డికి  చోటు ఇవ్వాల్సిందే
ఇక ఇర్ఫాన్‌ పఠాన్‌ ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరు చెప్పింది బాగుంది. ఇక ఎనిమిదో స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్‌ చేస్తే బాగుంటుంది. ఇక జట్టులో సమతూకం ఉండాలంటే.. బౌలింగ్‌ ఆప్షన్లు కూడా చూసుకోవాలి. జట్టులో కచ్చితంగా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌కు ఒక బ్యాకప్‌ ఆప్షన్‌ ఉండాలి. నితీశ్‌ కుమార్‌ రెడ్డి రూపంలో మనకు అద్భుతమైన ఆటగాడు అందుబాటులో ఉన్నాడు.

ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కువ మందికి సాధ్యం కాని ఘనతను సెంచరీ ద్వారా అతడు సాధించాడు’’ అని పేర్కొన్నాడు.

కాగా నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా ఇటీవల ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ టెస్టులో శతకంతో ఆకట్టుకున్నాడు.

ఇక ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీ తప్పకుండా తుదిజట్టులో ఉంటారని అంచనా వేసిన ఇర్ఫాన్‌ పఠాన్‌.. బుమ్రా గాయం త్వరగా నయమైపోవాలని ఆకాంక్షించాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఆరంభం కానుంది. 

అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ తిరస్కరించగా.. హైబ్రిడ్‌ విధానంలో భారత్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తటస్థ వేదికైన దుబాయ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ సేన తమ ప్రయాణం ఆరంభించనుంది.

సునిల్‌ గావస్కర్‌- ఇర్ఫాన్‌ పఠాన్‌ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి ఎంచుకున్న భారత జట్టు
రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, శుబ్‌మన్‌ గిల్‌, సంజూ శాంసన్‌, మహ్మద్‌ సిరాజ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి.

చదవండి: CT 2025: వరల్డ్‌కప్‌లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ: శ్రేయస్‌ అ‍య్యర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement