లండన్: ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో తొలిసారి నిర్వహించిన ‘బాబ్ విల్లీస్ ట్రోఫీ’ని గెలుచుకున్న ఎసెక్స్ జట్టు సంబరాల్లో చిన్న అపశ్రుతి దొర్లింది. సోమర్సెట్‌తో జరిగిన ఫైనల్ ఆదివారం ‘డ్రా’గా ముగియగా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఎసెక్స్ చాంపియన్‌గా నిలిచింది. అయితే లార్డ్స్ మైదానం బాల్కనీలో జరిగిన సంబరాల్లో ఎసెక్స్ యువ ఆటగాడు ఒకడు అత్యుత్సాహంతో తన జట్టు సహచరుడు ఫెరోజ్ ఖుషీపై బీర్ పోశాడు. ఇది వివాదానికి దారి తీసింది. ఇంగ్లండ్ క్రికెట్‌లో ముస్లిం క్రికెటర్లతో గెలుపు వేడుకలు చేసుకునే సమయంలో ఇతర ఆటగాళ్లు సాధారణంగా మద్యం విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు.
జాతీయ జట్టు సభ్యులైన మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌లను కూడా తమ విజయంలో భాగంగా చేసి సంబరాల సమయంలో వారిపై షాంపేన్ చల్లకుండా ఉండే రివాజును ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ చాలా కాలంగా పాటిస్తోంది. తాజా ఘటనపై కూడా ఎసెక్స్ కౌంటీ జట్టు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరింది. క్రికెట్‌లో ‘భిన్నత్వంలో ఏకత్వం’ను తాము గౌరవిస్తామని, తమ జట్టులో కూడా మతం, జాతి భేదాలు లేకుండా ఆటగాళ్లు ఉన్నారని వెల్లడించింది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, యువ ఆటగాళ్లకు ఈ విషయంలో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపడతామని పేర్కొంది. కుర్రాళ్లు తమ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారని, చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని ఎసెక్స్ స్పష్టం చేసింది. తాజా సీజన్‌లోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన 21 ఏళ్ల ఫెరోజ్ ఖుషీ ఎసెక్స్ తరఫున 4 మ్యాచ్‌లు ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment