లండన్: జూనియర్ స్థాయి క్రికెట్‌లో బౌన్సర్లను నిషేదించేందుకు క్రికెట్ వర్గాలు కృషి చేయాలని ప్రముఖ కంకషన్ వైద్యుడు మైఖేల్ టర్నర్ పిలుపునిచ్చాడు. బౌన్సర్లు సంధించే క్రమంలో బంతి తలకు బలంగా తగిలితే యువ క్రికెటర్లు కంకషన్‌కు(అపస్మారక స్థితి) గురయ్యే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. యుక్త వయసు క్రికెటర్లను బౌన్సర్ల బారి నుంచి కాపాడే బాధ్యత క్రికెట్ చట్టాల రూపకర్తలపై ఉందని, అందుకు వారు సానుకూలంగా స్పందించి సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫ్లాట్ పిచ్‌లపై నుంచి నిప్పులు చెరుగుతూ దూసుకొచ్చే బంతులు యువ క్రికెటర్ల భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.
బౌన్సర్ల బారి నుండి కాపాడేందుకు అత్యాధునిక హెల్మెట్లు అందుబాటులో ఉన్నా, బంతి వేగం ధాటికి అవి తునాతునకలు కావడం చాలా సందర్భాల్లో గమనించామని ఆయన పేర్కొన్నారు. క్రికెటర్లను.. అందులోనూ జూనియర్ స్థాయి క్రికెటర్లను కంకషన్ బారి నుండి కాపాడాలంటే బౌన్సర్లను నిషేదించడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. కాగా, ప్రమాదకర బౌన్సర్ కారణంగా ఆసీస్ మాజీ ఆటగాడు ఫిలిప్ హ్యూస్ మృతి చెందిన నాటి నుండి క్రికెట్‌లో బౌన్సర్లపై నిషేదం అన్న అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది.. ఆతరువాత కూడా చాలా సందర్భల్లో బంతి తలకు తాకడం వల్ల క్రికెటర్లు అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటనలు చాలా చూశాం.. ఇది చాలా ప్రమాదకర హెచ్చరిక అని టర్నర్ ఆందోళన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment