సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గురువారం తన అభిమానులకు శుభవార్తను అందించారు. త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నాం. వచ్చే ఏడాది జనవరిలో మా ఇంట్లోకి మూడో వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఆయన అభిమానులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. చాలామంది విరుష్కల జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా వుండగా ఈ వార్త విని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మాత్రం ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే కరోనా కారణంగా ఆగిపోయిన క్రికెట్ మ్యాచ్‌లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులు అక్టోబర్ 11వ తేదీన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తో బరిలోకి దిగనున్నాయి. తరువాత డిసెంబర్ 3 వ తేదీన ఒక టెస్ట్ ఆడనున్నాయి. ఇక జనవరి 12, 2021 నుంచి మూడు వన్డేలను ఆడనున్నాయి. అయితే జనవరిలో తనకు బిడ్డ పుట్టబోతున్నాడంటూ విరాట్ తెలిపారు. ఈ క్రమంలో జనవరిలో జరిగే మ్యాచ్‌లలో కోహ్లి ఆడతాడా లేదా అనే అనుమానంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కరోనా కారణంగా మ్యాచ్‌లన్ని వాయిదా పడటంతో క్రికెట్ బోర్డులు చాలా నష్టపోయాయి. ఇప్పడు భారత్ టూర్ వలన దాదాపు 300 మిలియన్ డాలర్లు లభించనున్నాయి. ఇలాంటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లిలాంటి సూపర్ క్రికెటర్లు ఆడకపోతే తీవ్ర నష్టం తప్పదనే ఆందోళనలో ఉంది. గత ఆసీస్ పర్యటనలో విరాట్ కోహ్లి బ్యాట్‌తో దుమ్మురేపాడు. 2018-19 సీజన్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను గెలుచుకుంది. దాంతో ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈసారి ఆసీస్ పర్యటనకు కోహ్లి వెళ్లకపోతే అంత మజా ఉండదనేది సీఏ భావన. ఒకవేళ కోహ్లి వెళ్లకపోతే సిరీస్‌కు అంత మార్కెట్ ఉండకపోవచ్చనే టెన్షన్ అప్పుడే సీఏలో మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment