విరాట్ కోహ్లి.. టీమిండియా రన్‌మెషిన్‌గా గుర్తింపు పొందాడు. ఒకప్పుడు సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లి.. నాలుగేళ్ల నుంచి మాత్రం సెంచరీ కోసం పరితపిస్తున్నాడు. మధ్యలో కరోనా వల్ల విరామం వచ్చినప్పటికి.. ఆ తర్వాత చాలా మ్యాచ్‌లు ఆడినప్పటికి హాఫ్ సెంచరీలు సాధించాడే కానీ సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. కోహ్లి సెంచరీ కోసం అభిమానులు కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. ఇక కోహ్లి బ్యాట్ నుంచి సెంచరీ రావడం కష్టమే అని హేటర్స్ ఫిక్స్ అయిన తరుణంలో 71వ సెంచరీని బాది తనపై వస్తున్న ట్రోలింగ్‌కు చెక్ పెట్టేశాడు.
అంతేకాదు ఆసియా కప్‌లో కచ్చితంగా సెంచరీ చేస్తాడని భావించిన అభిమానుల కలను కోహ్లి నెరవేర్చాడు. ఎందుకంటే ఆసియా కప్‌లో కోహ్లికి మంచి రికార్డు ఉంది. తనకు అచ్చొచ్చిన టోర్నీలోనే కోహ్లి శతకం సాధించాడు. ఆసియాకప్‌లో భాగంగా గురువారం అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి 53 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా 61 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లికి టి20ల్లో ఇదే తొలి సెంచరీ. అలాగే టి20 కెరీర్‌లోనూ కోహ్లి అత్యధిక వ్యక్తిగత స్కోరును అందుకున్నాడు. కాగా టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం కోహ్లి మీడియాతో మాట్లాడాడు.
'టి20 ఫార్మాట్‌లో సెంచరీ చేస్తానని నేను పెద్దగా అనుకోలేదు. అందుకే 71వ సెంచరీ ఇలా చేయడం కాస్త షాకింగ్‌గా అనిపించింది. రెండున్నరేళ్లుగా సెంచరీ చేయలేకపోయా. త్వరలో 34 ఏళ్లు నిండబోతున్నాయి. చాలామంది నా ఫామ్ గురించి మాట్లాడారు. 71వ సెంచరీ రావడం లేదని అన్నారు. అయితే నేను మాత్రం ఇప్పటికే చేసిన 70 సెంచరీల గురించే ఆలోచించా. బయట చాలా జరుగుతాయి. అన్నివేళలా నాకు అండగా నిలబడిన వ్యక్తికి ఈ సెంచరీ అంకితం ఇవ్వాలని అనుకుంటున్నా.
డియర్ అనుష్క... ఇది నీకోసం. అలాగే వామిక కోసం కూడా. క్లిష్ట సమయాల్లో అనుష్క నాకు అండగా నిలబడింది. ఈ నాలుగు వారాల గ్యాప్ నాకెంతో ఉపయోగపడింది. బ్రేక్ తీసుకున్నాకే నేనెంత అలిసిపోయానో అర్థమైంది. అందుకే కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత నెట్స్‌లో ఎక్కువ సమయం గడిపాను. మళ్లీ పూర్వ ఫామ్‌లోకి వస్తాననే భావన నాలోనే కలిగింది.' అంటూ ఉద్వేగంతో పేర్కొన్నాడు.
చదవండి: Virat Kohli: 'కింగ్ ఈజ్ బ్యాక్'.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
Comments
Please login to add a commentAdd a comment