ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ డు ప్లెసిస్, రసెల్, కమిన్స్
ముంబై: లక్ష్యం 221... ఛేదనలో ఆరు ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 45/5... ఇదీ క్లుప్తంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఇన్నింగ్స్ ఆరంభం. అయితే ప్యాట్ కమిన్స్ (34 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), ఆండ్రీ రసెల్ (22 బంతుల్లో 54; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ (24 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)ల విధ్వంసకర ఇన్నింగ్స్‌లు కేకేఆర్‌కు విజయాన్ని ఖాయం చేసేలా కనిపించాయి. చివర్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం... అదే సమయంలో చేతిలో వికెట్లు లేకపోవడంతో చిరస్మరణీయ విజయానికి కేకేఆర్ కొద్ది దూరంలో ఆగి ఓడింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్ డు ప్లెసిస్ (60 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీకి ఐదు పరుగుల దూరంలో నిలువగా... రుతురాజ్ గైక్వాడ్ (42 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదన మొదలు పెట్టిన కోల్‌కతాను ఆరంభంలో దీపక్ చహర్ (4/29) తన పేస్‌తో దెబ్బకొట్టినా... అనంతరం పుంజుకుని 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇన్‌గిడి (3/28) కూడా ఆకట్టుకున్నాడు.
తడబడి...
0, 9, 8, 7, 4 భారీ ఛేదనలో కోల్‌కతా టాప్–5 బ్యాట్స్‌మెన్ స్కోర్లు ఇవి. కొత్త బంతితో దీపక్ చహర్ మరోసారి మెరవడంతో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ క్రీజులోకి అలా వచ్చి ఇలా వెళ్లారు. గిల్ (0), నితీశ్ రాణా (9), మోర్గాన్ (7), నరైన్ (4)లను దీపక్ చహర్ అవుట్ చేయగా... రాహుల్ త్రిపాఠి (8)ని ఇన్‌గిడి పెవిలియన్‌కు చేర్చాడు.
రఫ్ఫాడించిన రసెల్, కమిన్స్
కోల్‌కతా టాప్–5 బ్యాట్స్‌మెన్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా... రసెల్ రూపంలో ఓ భారీ తుఫాన్ సీఎస్‌కే బౌలర్లను ముంచేందుకు అప్పుడే వాంఖడే స్టేడియాన్ని తాకింది. రసెల్ ఆడింది 22 బంతులే అయినా... అతడు సృష్టించిన విధ్వంసం ఒక దశలో సీఎస్‌కే చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను చేజారేలా చేసింది. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను బౌండరీకి తరలించిన అతడు... ఆ తర్వాత భారీ సిక్సర్ కొట్టాడు. ఇక శార్దుల్ ఠాకూర్ వేసిన పదో ఓవర్‌లో ఉగ్రరూపం దాల్చిన రసెల్ మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు.
ఇదే జోరును కొనసాగించిన అతడు 21 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు దినేశ్ కార్తీక్ కూడా మెరుపులు మెరిపించడంతో విజయంపై కేకేఆర్‌కు ఆశలు మొదలయ్యాయి. అయితే స్యామ్ కరన్ వేసిన బంతిని సరిగ్గా అంచనా వేయకుండా రసెల్ క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. రసెల్, దినేశ్ కార్తిక్ ఆరో వికెట్‌కు కేవలం 24 బంతుల్లో 81 పరుగులు జోడించారు. రసెల్ అవుటైన కొద్ది సేపటికే దినేశ్ కార్తీక్ కూడా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు. హమ్మయ్య... గెలిచేశాం... అని ధోని అనుకునేలోపల కమిన్స్ రూపంలో మరో తుఫాన్ వాంఖెడేను తాకింది.
స్యామ్ కరన్ వేసిన 16వ ఓవర్‌లో కమిన్స్ వరుసగా 2, 6, 6, 6, 4, 6 బాది 30 పరుగులు రాబట్టడంతో చెన్నై మరోసారి అయోమయంలో పడింది. ఆ తర్వాత కూడా కమిన్స్ అడపాదడపా బౌండరీలు సాధిస్తూ 23 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. చెన్నై కూడా నాగర్‌కోటి (0), వరుణ్ చక్రవర్తి (0)లను అవుట్ చేయడంతో 19వ ఓవర్ ముగిసేసరికి కేకేఆర్ 201/9గా నిలిచింది. చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 20 పరుగులు అవసరం కాగా... తొలి బంతిని స్ట్రయిట్‌గా ఆడిన కమిన్స్ రెండో పరుగు కోసం ప్రయత్నించగా ప్రసిధ్ కృష్ణ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో రనౌట్ అయ్యాడు.
జస్ట్ మిస్...
మరోసారి చెన్నై జట్టులో చోటు దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్ రెచ్చిపోయాడు. మరో ఎండ్‌లో డు ప్లెసిస్ సమయోచితంగా ఆడాడు. పవర్‌ప్లే ముగిసేసరికి సీఎస్‌కే 54 పరుగులు చేసింది. రుతురాజ్ 33 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. మరికొద్ది సేపటికే వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రుతురాజ్... మిడ్‌వికెట్ దగ్గర కమిన్స్ అద్భుతమైన క్యాచ్‌కు పెవిలియన్‌కు చేరాడు. రుతురాజ్ అవుటయ్యాక డు ప్లెసిస్... ధనాధన్ ఇన్నింగ్స్‌ను షురూ చేశాడు.
35 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసిన అతడు... మొయిన్ అలీ (12 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి రెండో వికెట్‌కు 50 పరుగులు, ధోని (8 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 36 పరుగులు జోడించాడు. 19వ ఓవర్ ముగిసే సమయానికి డు ప్లెసిస్ 55 బంతుల్లో 82గా ఉన్నాడు. చివరి ఓవర్లో అతడి సెంచరీకి మరో 18 పరుగులు అవసరం కాగా... రెండు సిక్సర్లతో 13 పరుగులు మాత్రమే చేసిన డు ప్లెసిస్ సెంచరీ చేసే చాన్స్‌ను మిస్ చేసుకున్నాడు.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) కమిన్స్ (బి) వరుణ్ చక్రవర్తి 64; డు ప్లెసిస్ (నాటౌట్) 95; మొయిన్ అలీ (స్టంప్డ్) దినేశ్ కార్తీక్ (బి) సునీల్ నరైన్ 26; ధోని (సి) మోర్గాన్ (బి) రసెల్ 17; జడేజా (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 220.
వికెట్ల పతనం: 1–115, 2–165, 3–201.
బౌలింగ్: వరుణ్ చక్రవర్తి 4–0–27–1; కమిన్స్ 4–0–58–0; సునీల్ నరైన్ 4–0–34–1; ప్రసిధ్ కృష్ణ 4–0–49–0; రసెల్ 2–0–27–1; నాగర్‌కోటి 2–0–25–0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) ఇన్‌గిడి (బి) దీపక్ చహర్ 0; నితీశ్ రాణా (సి) ధోని (బి) దీపక్ చహర్ 9; త్రిపాఠి (సి) ధోని (బి) ఇన్‌గిడి 8; మోర్గాన్ (సి) ధోని (బి) దీపక్ చహర్ 7; నరైన్ (సి) జడేజా (బి) దీపక్ చహర్ 4; దినేశ్ కార్తీక్ (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 40; రసెల్ (బి) స్యామ్ కరన్ 54; కమిన్స్ (నాటౌట్) 66; నాగర్‌కోటి (సి) డు ప్లెసిస్ (బి) ఇన్‌గిడి 0; వరుణ్ చక్రవర్తి (రనౌట్) 0; ప్రసిధ్ కృష్ణ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 202.
వికెట్ల పతనం: 1–1, 2–17, 3–27, 4–31, 5–31, 6–112, 7–146, 8–176, 9–200, 10–202.
బౌలింగ్: దీపక్ చహర్ 4–0–29–4, స్యామ్ కరన్ 4–0–58–1, ఇన్‌గిడి 4–0–28–3, జడేజా 4–0–33–0, శార్దుల్ ఠాకూర్ 3.1–0–48–0.
Comments
Please login to add a commentAdd a comment