
మొదట ధోనిని అనుకోలేదని ఆ జట్టు మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ తెలిపాడు.
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను ముంబై ఇండియన్స్ (4 సార్లు) తర్వాత అత్యధికంగా గెలిచిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ (3 సార్లు) ఉంది. అంతేకాకుండా ఐపీఎల్‌లో ఆడిన ప్రతిసారీ (2016, 17 సీజన్‌ల్లో జట్టు పాల్గొనలేదు) ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ఏకైక జట్టు కూడా చెన్నైయే. అంతలా చెన్నై విజయవంతం అయిందంటే దానికి కారణం మహేంద్ర సింగ్ ధోని నాయకుడిగా ఉండటమే అనేది అక్షర సత్యం. అయితే 2008 ఐపీఎల్ ఆరంభ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం... తమ జట్టు మార్కీ ప్లేయర్(కీలక ఆటగాడు)గా మొదట ధోనిని అనుకోలేదని ఆ జట్టు మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ తెలిపాడు.
అతడి స్థానంలో అప్పటి భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను తీసుకొని, అతడికే సారథ్య బాధ్యతలు అప్పగించాలనే భావనలో చెన్నై ఓనర్లు ఉన్నట్లు బద్రీనాథ్ వ్యాఖ్యానించాడు. అయితే సెహ్వాగ్ ఢిల్లీ జట్టుకు ఆడతానని అనడంతో... చెన్నై ధోనిపై గురిపెట్టిందని పేర్కొన్నాడు. వేలంలో ధోనిని 15 లక్షల అమెరికన్ డాలర్ల (అప్పటి డాలర్ విలువ ప్రకారం రూ. 6 కోట్లు)కు దక్కించుకోగానే... ఆ ముందు ఏడాది జరిగిన ఆరంభ టి20 ప్రపంచ కప్‌లో అతడి సారథ్యంలోని భారత జట్టు విజేతగా నిలవడాన్ని పరిగణలోకి తీసుకొని ధోనికి సారథ్య బాధ్యతలు అప్పగించారని బద్రీనాథ్ తెలిపాడు.
(చదవండి: మూడో స్థానంలో రాయుడు ఆడాలి)