ముంబై: 'అవకాశమిస్తే ఐపీఎల్‌లో ఆడేందుకు నేను సిద్ధం.. నా ఆటతీరుపై నాకు నమ్మకముంది.. చాన్స్ ఇస్తే మాత్రం నిరూపించుకుంటా.' అంటూ టీమిండియా క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి పుజారా అరంగేట్రం చేసిన కొత్తలో టెస్టులతో పాటు వన్డేల్లోనూ ఆడాడు. అయితే కాస్త నెమ్మదైన శైలిలో బ్యాటింగ్ కొనసాగించిన పుజారా రానురాను కేవలం టెస్టు జట్టుకు మాత్రమే పరిమితమయి టెస్ట్ స్పెషలిస్ట్‌గా ముద్రవేయించుకున్నాడు.
ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవడంలో పుజారా పాత్ర మరువలేనిది. ఆసీస్ పేసర్ల బౌన్సర్లు అతని శరీరాన్ని గాయపరిచినా వాటిని లెక్కచేయకుండా ఇన్నింగ్స్‌లు ఆడడం పుజారాకే సొంతమైంది. ముఖ్యంగా చివరి టెస్టులో పుజారా రెండో ఇన్నింగ్స్‌లో దాదాపు 200కు పైగా బంతులను ఎదుర్కొని 65 పరుగులే చేసినా.. అతను ఆడిన ఇన్నింగ్స్ టీమిండియాను విజయంవైపు నడిపించాయంటే అతిశయోక్తి కాదు. ఆసీస్‌పై టెస్టు సిరీస్ విజయానంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో పుజారాను ఎన్డీటీవీ ఇంటర్యూ చేసింది. చదవండి: అది జాతీయ జంతువు.. అందుకే కట్ చేయలేదు
ఈ సందర్భంగా పుజారా స్పందించాడు. 'ఒక గొప్ప దేశంతో క్రికెట్ ఆడినందుకు గర్వంగా ఉంది. నిజానికి ఆస్ట్రేలియా గొప్ప పోటీతత్వం ఉన్న జట్టు. అడిలైడ్‌లో ఘోర ఓటమి తర్వాత మేము కోలుకున్న తీరు ఆశ్చర్యపరిచింది. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనే ఆసీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి విజయం సాధించి ఫుంజుకున్నాం. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేశాం. రెండో టెస్టు విజయంతో పొందిన ఆత్మవిశ్వాసంతో మిగిలిన మూడు, నాలుగు టెస్టులు గెలవడానికి ప్రయత్నించాం.' అంటూ వివరించాడు. చదవండి: 'ఆరోజు బ్యాట్ పట్టుకోవడమే ఇబ్బందిగా మారింది'
కాగా ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో రన్స్ కంటే గాయాలు ఎక్కువగా తగలడం ఇబ్బంది అనిపించలేదా అన్న ప్రశ్నకు పుజారా ఆసక్తికర సమాధానమిచ్చాడు.' ఆటలో గాయాలనేవి సహజం.. అయితే ఈసారి ఆసీస్ పర్యటనలో కాస్త ఎక్కువ దెబ్బలు తగిలాయి. నిజానికి మెల్‌బోర్న్ టెస్టు నుంచే నాకు గాయాలయ్యాయి. మెల్‌బోర్న్ టెస్టు తర్వాత ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్ సందర్భంగా నా చేతి వేలికి గాయమైంది. ఆ నొప్పితోనే సిడ్నీ టెస్టులో ఆడాను. కానీ బ్రిస్బేన్ టెస్టులో మళ్లీ అదే చేతికి గాయమైంది.. ఈసారి మాత్రం నొప్పితో విలవిలలాడాను.. ఎంతలా అంటే ఆ నొప్పితో నాలుగు వేళ్లు ఉపయోగించి బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీనికి తోడు ఆసీస్ పేసర్లు వేసిన బంతులు పదేపదే నా శరీరానికి గాయాలుగా మార్చాయి. అయితే వీటిని తట్టుకొని మ్యాచ్‌ను గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అంటూ పేర్కొన్నాడు.
రానున్న ఇంగ్లండ్ సిరీస్‌ను తేలిగ్గా తీసుకునే ప్రసక్తే లేదని పుజారా పేర్కొన్నాడు. ఈ టెస్ట్ సిరీస్‌ను ఇరుజట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఏ జట్టు మొదట ఫైనల్ చేరుతుందనేది ఈ సిరీస్‌తో తేలిపోనుంది. పైగా ఇంగ్లండ్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. లంకను వారి స్వదేశంలో క్లీన్‌స్వీప్ చేసిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.. వారికి మనదేశంలో కూడా మంచి రికార్డు ఉంది. అందుకే ఫిబ్రవరి 5వ తేదీన మొదలవనున్న తొలి టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'ఓడిపోయుండొచ్చు.. కోహ్లి మనసు గెలిచాం'
అవకాశమిస్తే ఐపీఎల్ ఆడతారా అన్న ప్రశ్నకు పుజారా స్పందిస్తూ.. 'కచ్చితంగా.. ఐపీఎల్‌లో ఆడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఐపీఎల్ ఆడేందుకు నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటా. ఈసారి జరిగే వేలంలో నన్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసినా వారికి పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తా.టెస్ట్ క్రికెటర్‌గా ముద్రపడిన నాకు ఏ ఫార్మాట్లో ఎంత వేగంగా ఆడాలన్నదానిపై ఒక క్లారిటీ ఉంది. ఒక అవకాశమిస్తే నన్ను నేను నిరూపించకుంటా.. నాకు ఆ నమ్మకముంది.'అంటూ వెల్లడించాడు.
యార్క్‌షైర్‌లో స్టీవ్ అన్న పేరుతో వివక్షకు గురైనట్లు షేన్ వార్న్ కామెంట్స్ చేశారు .. దీనిపై మీ స్పందన ఏంటని ప్రశ్నించగా.. 'నేను యార్క్‌షైర్‌కు ఆడేటప్పుడు నేను ఎలాంటి వివక్షకు గురి కాలేదు. యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించినన్ని రోజులు సంతోషంగా గడిపా. స్టీవ్ అనే పదాన్ని నేను పెద్దగా పట్టించుకోను.. నా పేరు పలకడం వారికి కష్టమై అలా పిలిచి ఉంటారు. దానిని నేను అంత సీరీయస్‌గా తీసుకోలేదు 'అని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment