విశాఖ స్పోర్ట్స్ : గెలుపోటములు సహజం.. జాతీయ స్థాయి పోటీకి ఎదగడం గెలుపుతో సమానమని రాష్ట్ర పర్యాటక క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. ఆలిండియా ఆహ్వాన సీఎం కప్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలను సాగరతీరంలోని ఫ్లడ్‌లైట్ వెలుతురుతో ఆదివారం రాత్రి ఆమె ప్రారంభించారు. ఏ రంగంలోనైనా విజేతగా నిలవాలంటే పట్టుదల ఉండాలన్నారు. బాక్సింగ్ క్రీడలో రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్‌కోసం మంత్రి అమర్‌నాథ్‌తో కలిసి ఈ ప్రాంగణం నుంచే ఉద్యమించామని, రాజధానికి కోసం విశాఖ గర్జనలో పాల్గొన్నానని రోజా గుర్తు చేశారు.
అంతేకాకుండా తన సినీ కెరీర్ ప్రారంభం నుంచి విశాఖ ప్రజలతో అనుబంధం ఉందన్నారు. విశాఖ వాసుల కష్టసుఖాల్లో తాను తోడుంటానని స్పష్టం చేశారు. క్రీడాకారులు, కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోదన్నారు. కాసేపు బాక్సింగ్ గ్లోవ్స్ ధరించి అతిథులతోనూ పంచ్‌లు విసురుతూ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. జీసీసీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలకు విశాఖ వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ క్రీడల్లో రాణించిన వారికి గ్రూప్‌వన్ అధికారుల్ని చేయడం సీఎం జగన్ మోహన్‌రెడ్డికి క్రీడాకారులపై ఉన్న గౌరవానికి నిదర్శనమన్నారు. టోర్నీ నిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్రమారిటైమ్ బోర్డ్ చైర్మన్ కాయల వెంకటరెడ్డి మాట్లాడుతూ గతేడాది ఇదే వేదికపై రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహించామని ఇప్పుడు జాతీయ ఆహ్వాన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
ఆంధ్ర ఆటగాడు బోయ అర్జున్, తెలంగాణ కు చెందిన భరణిప్రసాద్ మధ్య తొలి బౌట్‌ను అతిథులు ప్రారంభించడంతో చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ రవిబాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు, టోర్ని నిర్వాహక ప్రతినిధి కాయల సూర్యారెడ్డి పాల్గొన్నారు. ఈ చాంపియన్‌షిప్‌లో 14 రాష్ట్రాలకు చెందిన బాక్సర్లు సబ్‌జూనియర్, జూనియర్, యూత్, ఎలైట్ గ్రూప్‌ల్లో పోటీపడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment