తిరుచానూరు(తిరుపతి జిల్లా): అన్ని అనుమతులతోనే విశాఖపట్నంలోని రుషికొండ వద్ద నిర్మాణాలు జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. విశాఖను పరిపాలన రాజధాని చేయడం పవన్‌కళ్యాణ్‌కు, చంద్రబాబుకు ఇష్టం లేదని.. అందుకే అసత్య ప్రచారాలతో విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ రుషికొండపై ఏం అక్రమాలు జరిగాయో చెప్పాలని పవన్‌ను డిమాండ్ చేశారు.
రుషికొండ వద్ద ప్రభుత్వ భవనాల నిర్మాణాలను అడ్డుకోవడానికి గతంలో పవన్, చంద్రబాబు పార్టీలతో పాటు రఘురామకృష్ణంరాజు కోర్టులను ఆశ్రయించారని గుర్తు చేశారు. ఏ కోర్టు అయినా.. ఈ నిర్మాణాలు ఆపేయాలంటూ తీర్పులిచ్చాయా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కూడా ఈ నిర్మాణాలకు అనుమతులిచ్చిందని చెప్పారు. సుప్రీంకోర్టు కంటే పవన్ ఏమైనా గొప్ప వ్యక్తా అని మండిపడ్డారు. రుషికొండ వద్ద నిర్మాణాలను హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షిస్తోందని చెప్పారు.
కొండలపై ఇవి కనిపించలేదా పవన్?
‘కొండపై కట్టడమే పవన్‌కు సమస్య అయితే.. మరి విశాఖలో రామానాయుడు స్టూడియో ఎక్కడ ఉంది? ఐటీ టవర్స్ ఎక్కడ ఉన్నాయి.. వేంకటేశ్వరుని ఆలయం ఎక్కడ ఉంది?’ అని పవన్‌ను మంత్రి రోజా ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌లో మీ ఇల్లు, మీ అన్న ఇల్లు కొండలపైనే ఉన్నాయి కదా? రామోజీ ఫిలింసిటీ కూడా కొండలు, గుట్టలపైనే కదా ఉంది. అప్పుడు పర్యావరణ విధ్వంసం గుర్తుకు రాలేదా?’ అని నిలదీశారు. టీడీపీ నేత బాలకృష్ణ అల్లుడు, నారా లోకేశ్ తోడల్లుడు శ్రీభరత్ విశాఖలో రుషికొండ సమీపంలోనే గీతం యూనివర్సిటీ పేరుతో 40 ఎకరాలు కబ్జా చేస్తే ఎందుకు మాట్లాడలేదని పవన్‌ను మంత్రి రోజా ప్రశ్నించారు.
ఏడాదికి మూడు పంటలు పండే 33 వేల ఎకరాలను రైతుల నుంచి చంద్రబాబు లాక్కున్నప్పుడు.. మాట్లాడకుండా హెరిటేజ్ ఐస్‌క్రీం తింటున్నారా అని పవన్‌పై మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే తమ నాయకుడు వైఎస్ జగన్ తన సొంత డబ్బుతో తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారని.. ఇప్పుడు కూడా అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు.
కానీ కృష్ణా నది కరకట్టలో టీడీపీ అధినేత చంద్రబాబు నివసించిన అక్రమ నిర్మాణం గురించి ఏనాడైనా ప్రశ్నించావా అని పవన్‌ను రోజా నిలదీశారు. చంద్రబాబు తన అధికార, అనధికార, సొంత నివాసాలకు మరమ్మతుల పేరుతో రూ.184.58 కోట్ల ప్రజాధనాన్ని దురి్వనియోగం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని పవన్‌ను మంత్రి రోజా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment