కాన్వే మెరుపు​ ఇన్నింగ్స్‌.. సన్‌రైజర్స్‌కు ‘బోనస్‌’ షాక్‌! | Conway Unbeaten 76, Ruthless JSK End Sunrisers Winning Streak With Bonus Point, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

డెవాన్‌ కాన్వే మెరుపు​ ఇన్నింగ్స్‌.. సన్‌రైజర్స్‌కు ‘బోనస్‌’ షాక్‌!

Published Mon, Jan 27 2025 9:59 AM | Last Updated on Mon, Jan 27 2025 11:16 AM

Conway Unbeaten 76 Ruthless JSK End Sunrisers Winning Streak With Bonus Point

PC: SAT20 X

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025(SA20- 2025) ఎడిషన్‌ తుది అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే పర్ల్‌ రాయల్స్‌(Parl Royals) ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగా.. మిగిలిన మూడు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇలాంటి తరుణంలో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌(Sunrisers Eastern Cape) జట్టుకు జొబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ భారీ షాకిచ్చింది.

సన్‌రైజర్స్‌ వరుస విజయాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు.. ‘బోనస్‌’ పాయింట్‌(Win With Bonus Point)తో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్లే ఆఫ్స్‌ రేసులోనూ రైజర్స్‌తో పోటీకి సై అంటోంది. 

కాగా గ్వెబెర్హా వేదికగా జనవరి 9న సౌతాఫ్రికా టీ20 లీగ్‌ మూడో సీజన్‌ ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో పర్ల్‌ రాయల్స్‌తో తలపడ్డ.. డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ ఓటమితో ప్రయాణాన్ని ఆరంభించింది.

వరుసగా నాలుగు విజయాలు
అనంతరం.. ప్రిటోరియా క్యాపిటల్స్‌ చేతిలోనూ ఓడిన మార్క్రమ్‌ బృందం.. తర్వాత వరుసగా నాలుగు విజయాలు సాధించింది. డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ను వరుసగా రెండు మ్యాచ్‌లలో చిత్తు చేయడంతో పాటు.. ప్రిటోరియా క్యాపిటల్‌స​, జొబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌పై గెలుపొందింది.

ఈసారి మాత్రం ఘోర పరాజయం
ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో జొబర్గ్‌ జట్టుతోనే తలపడిన సన్‌రైజర్స్‌ ఈసారి మాత్రం ఘోర పరాజయం పాలైంది. జొహన్నస్‌బర్గ్‌ వేదికగా టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. అయితే, జొబర్గ్‌ బౌలర్ల ధాటికి 118 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ బెడింగ్‌హాం(40 బంతుల్లో 48), వికెట్‌ కీపర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌(37), మార్కో జాన్సెన్‌(22) మాత్రమే రాణించారు.

మిగతా వాళ్లలో ఓపెనర్‌ జాక్‌ క్రాలే, అబెల్‌, జోర్డాన్‌ హెర్మాన్‌, కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌, బేయర్స్‌ స్వానెపోయెల్‌ డకౌట్‌ కాగా.. లియామ్‌ డాసన్‌, ఒట్నీల్‌ బార్ట్‌మన్‌, రిచర్డ్‌ గ్లెసాన్‌(1*) ఒక్కో పరుగు మాత్రమే చేశారు. ఇక జొబర్గ్‌ బౌలర్లలో విల్‌జోన్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సిపామ్ల మూడు వికెట్లు, ఇమ్రాన్‌ తాహిర్, మతీశ పతిరణ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

 

డెవాన్‌ కాన్వే మెరుపు​ ఇన్నింగ్స్‌
ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జొబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ ఆదిలోనే కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌(15) వికెట్‌ కోల్పోయింది.  అయితే, మరో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే ధనాధన్‌ దంచికొట్టాడు. 56 బంతుల్లో పదకొండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా వన్‌డౌన్‌ బ్యాటర్‌ విహాన్‌ లూబే(17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌ , 25 రన్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించాడు.

ఫలితంగా మరో 36 బంతులు మిగిలి ఉండగానే జొబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ లక్ష్యాన్ని ఛేదించింది. తొమ్మిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై గెలుపొంది.. అదనపు పాయింట్‌ను కూడా ఖాతాలో వేసుకుంది. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆరు జట్లు లీగ్‌ దశలో పదేసి మ్యాచ్‌లు ఆడతాయి. 

పాయింట్ల కేటాయింపు ఇలా
మ్యాచ్‌ గెలిస్తే నాలుగు పాయింట్లు, ఫలితం తేలకపోతే రెండు పాయింట్లు వస్తాయి. ఓడితే పాయింట్లేమీ రావు. ఇక గెలిచిన- ఓడిన జట్టు మధ్య రన్‌రేటు పరంగా 1.25 రెట్ల తేడా ఉంటే.. నాలుగు పాయింట్లకు అదనంగా మరో బోనస్‌ పాయింట్‌ కూడా వస్తుంది.

జొబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ ఈ నిబంధన ప్రకారమే తాజాగా బోనస్‌ పాయింట్‌ సాధించి.. ఓవరాల్‌గా 15 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి దూసుకువచ్చింది. కాగా పర్ల్‌ రాయల్స్‌ ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు విజయాలతో 24 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.

మరోవైపు.. ఎంఐ కేప్‌టౌన్‌ ఏడింట నాలుగు(21 పాయింట్లు), సన్‌రైజర్స్‌ ఎనిమిదింట నాలుగు(19 పాయింట్ల) విజయాలతో పట్టికలో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. జొబర్గ్‌ ఏడింట మూడు గెలిచి నాలుగో స్థానంలో.. ప్రిటోరియా క్యాపిటల్స్‌ ఏడింట కేవలం ఒక్కటి గెలిచి ఐదు, డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ ఎనిమిదింట ఒక్క విజయంతో అట్టడుగున ఆరో స్థానంలో ఉన్నాయి. 

చదవండి: చరిత్ర సృష్టించిన హసరంగ.. ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement