వెస్టిండీస్, యూఎస్‌ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు.
ఎలాగైనా జట్టులోకి వస్తాడనుకున్న ఐపీఎల్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మాట్ షార్ట్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్ లాంటి ఆశావహులకు కూడా మొండిచెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్‌కప్ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్ వార్నర్‌ను సెలెక్టర్లు కరుణించారు.
ఎండ్ ఓవర్స్ స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్ అగర్, కెమరూన్ గ్రీన్‌లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్ ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా మాథ్యూ వేడ్ జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ త్రయం పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ కొనసాగనున్నారు.
మిచ్ మార్ష్‌తో పాటు ట్రవిస్ హెడ్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ ఆల్‌రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటా ఆడమ్ జంపా జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రయాణం జూన్ 5న మొదలవుతుంది. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో తలపడుతుంది. గ్రూప్-బిలో ఆసీస్.. ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్‌లతో పోటీపడుతుంది.
టీ20 వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
వరల్డ్‌కప్ విన్నర్లతో..
క్రికెట్ ఆస్ట్రేలియా తమ వరల్డ్‌కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. 2007 వన్డే వరల్డ్‌కప్ విన్నర్లు ఆసీస్ టీ20 వరల్డ్‌కప్ జట్టును అనౌన్స్ చేశారు. జట్టును ప్రకటించిన వారిలో దివంగత ఆండ్రూ సైమండ్స్ కొడుకు, కూతురు ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment