
సిడ్నీ : కరోనా వైరస్ కేసుల కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు షెడ్యూల్ దెబ్బ తినరాదని భావించిన బోర్డు (సీఏ) వేగవంతంగా తగిన చర్యలు చేపట్టింది. కోవిడ్–19 సమస్య ఉన్న అడిలైడ్ నుంచి ప్రత్యేక విమానంలో తమ ఆటగాళ్లందరినీ సిడ్నీ (న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రం)కి తరలించింది. సౌత్ ఆస్ట్రేలియా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పొరుగున ఉన్న ఇతర రాష్ట్రాలన్నీ తమ సరిహద్దులను మూసివేశాయి. సీఏ తరలించిన ఆటగాళ్లలో టెస్టు కెప్టెన్ టిమ్ పైన్, మార్నస్ లబ్‌షేన్, మాథ్యూ వేడ్, ట్రావిస్ హెడ్, గ్రీన్ ఉన్నారు.
వీరితో పాటు ఆసీస్ ‘ఎ’ టీమ్, బిగ్ బాష్ లీగ్‌లో ఉన్న క్రికెటర్లను కూడా బోర్డు సురక్షిత ప్రాంతమైన సిడ్నీకి మార్చింది. దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో ఆడుతున్న పైన్ తదితరులు కరోనా పరిణామాల కారణంగా అడిలైడ్‌లోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఇకపై ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా వీరంతా తమ సాధనపైనే దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని... అడిలైడ్ నుంచి తరలించకపోతే మున్ముందు మరింత సమస్య ఎదురయ్యేదని సీఏ పేర్కొంది.
అయితే తొలి టెస్టు వేదికలో మాత్రం మార్పు ఉండదని మరోసారి స్పష్టం చేసింది. డిసెంబర్ 17 నుంచి అడిలైడ్‌లో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అప్పటిలోగా పరిస్థితి అదుపులోకి వస్తుందని సీఏ ఆశిస్తోంది. సోమవారం నమోదైన 14 కొత్త కేసులతో పోలిస్తే సౌత్ ఆస్ట్రేలియాలో మంగళవారం 5 మాత్రమే రావడం ఊరట.
Comments
Please login to add a commentAdd a comment