టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ ప్రశంసలు కురిపించాడు. ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్ తుది జట్టులో కచ్చితంగా చోటు దక్కించుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. బౌన్సీ పిచ్‌లపై మెరుగైన ప్రదర్శన చేసిన ధ్రువ్ జురెల్.. ఆసీస్‌తో సిరీస్‌లో గనుక ఆడకపోతే తాను ఆశ్చర్యపోతానని పేర్కొన్నాడు.
కాగా ఆసీస్‌తో కీలక టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా పిచ్‌పై అవగాహన కోసం.. భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు భారత జట్టు ఆటగాళ్లు బరిలోకి దిగగా... రెండో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ కూడా ఆడారు.
మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ
అయితే, ఈ పోరులో మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ జురెల్ చక్కటి ఆటతీరు కనబర్చాడు. బౌన్సీ వికెట్‌పై పేసర్లను సమర్థంగా ఎదుర్కొని తొలి ఇన్నింగ్స్‌లో 80, రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేశాడు.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన మాజీ క్రికెటర్ టిమ్ పైన్... 23 ఏళ్ల ధ్రువ్ ఆట తీరు తనను ఆకట్టుకుందని కొనియాడాడు. ‘ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడి బ్యాటింగ్ శైలి చూసిన తర్వాత బోర్డర్–గావస్కర్ సిరీస్ తుది జట్టులో అతడు ఆడకపోతే ఆశ్చర్యపోవాల్సిందే.
మెరుగైన షాట్ సెలెక్షన్‌తో ఆకట్టుకున్నాడు
ధ్రువ్ ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆటతీరు చూస్తుంటే... సహచర ఆటగాళ్ల కంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తోంది. ఆసీస్ పిచ్‌లపై రాణించాలంటే పేస్‌ను, బౌన్స్‌ను ఎదుర్కోవడం తెలిసి ఉండాలి. అది ధ్రువ్‌లో చూశాను.
సాధారణంగా భారత జట్టు ఆటగాళ్ల ప్రదర్శన కన్నా అతడు మెరుగైన షాట్ సెలెక్షన్‌తో ఆకట్టుకున్నాడు. మెల్‌బోర్న్ పిచ్‌పై అతడు చేసిన పరుగులు చాలా విలువైనవి. ఆసీస్ పేసర్లను ఎదుర్కోవడం అంత సులువు కాకపోయినా... జురెల్‌లో ఆ సత్తా ఉందని మాత్రం చెప్పగలను.
రిషబ్ పంత్ రూపంలో టీమిండియాకు అత్యుత్తమ వికెట్ కీపర్ అందుబాటులో ఉన్నా... కనీసం ప్లేయర్‌గానైనా ధ్రువ్ భారత జట్టులో
ఉంటాడని అనుకుంటున్నా’ అని పైన్ అన్నాడు. కాగా ఈ ఏడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ధ్రువ్ జురెల్... కొన్ని చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడాడు.
పంత్ తిరిగి జట్టులోకి రావడంతో
అయితే, ప్రమాదం నుంచి కోలుకొని రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి రావడంతో జురెల్‌కు తుదిజట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. ఇటీవల న్యూజిలాండ్‌తోసిరీస్‌లోనూ జురెల్ జట్టులో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు.
అయితే, ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక సిరీస్‌కు ముందు ఆడిన అనధికారిక టెస్టులో రాణించడంతో ధ్రువ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే జరిగితే మిడిలార్డర్‌లో నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కు బదులు ధ్రువ్ జురెల్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: సౌతాఫ్రికాతో మూడో టీ20.. కీలక మార్పు సూచించిన భారత మాజీ స్టార్
Comments
Please login to add a commentAdd a comment