‘నువ్వొక అద్భుతం’.. థాంక్యూ వైభ‌వ్ సూర్యవంశీ! | Cricket Fans Thank-Vaibhav Sooryavanshi-Entertained-Super-Batting-IPL 2026 | Sakshi
Sakshi News home page

‘నువ్వొక అద్భుతం’.. థాంక్యూ వైభ‌వ్ సూర్యవంశీ!

May 30 2026 1:52 PM | Updated on May 30 2026 1:57 PM

Cricket Fans Thank-Vaibhav Sooryavanshi-Entertained-Super-Batting-IPL 2026

Photo Courtesy : IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఆట ముగిసింది. లీగ్ ద‌శ‌లో చాలా క‌ష్ట‌ప‌డి ప్లేఆఫ్స్ చేరిన రాజ‌స్తాన్ ఎలిమినేట‌ర్‌లో ఎస్ఆర్‌హెచ్‌ను చిత్తు చేసింది. అయితే క్వాలిఫ‌య‌ర్‌-2లో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఓడి సీజ‌న్‌ను మూడో స్థానంలో ముగించింది. అలా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఈ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్‌కు ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ.. ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ మాత్రం అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. 

గ‌త సీజ‌న్‌లోనే త‌న మెరుపులను చూపెట్టిన వైభ‌వ్ ఈ సీజ‌న్‌లో దానిని ప‌రిపూర్ణం చేశాడ‌ని చెప్పొచ్చు. ఈ సీజ‌న్‌లో అత‌డు కొన‌సాగించిన బ్యాటింగ్ విధ్వంసం మాములుగా లేదు. ఏదో రెండు మ్యాచ్‌ల్లో మెరిసి ఆ త‌ర్వాత విఫ‌ల‌మ‌య్యుంటే వైభ‌వ్ గురించి చ‌ర్చ ఉండేది కాదు. కానీ 15 ఏళ్ల వ‌య‌సులోనే క్రికెట్‌లో ఉన్న అన్ని షాట్ల‌ను అల‌వోక‌గా ఆడుతూ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. 

16 మ్యాచ్‌ల్లో 237కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 776 ప‌రుగులు సాధించిన వైభ‌వ్ ఖాతాలో ఒక సెంచ‌రీ స‌హా ఐదు అర్థ‌సెంచ‌రీలున్నాయి.  క్రీజులోకి అడుగుపెట్టిందే మొద‌లు ఎడాపెడా బౌండ‌రీలు, సిక్స‌ర్లు బాదడ‌మే కాకుండా ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా ఆడ‌డం అల‌వాటు చేసుకోవ‌డం వైభ‌వ్ సూర్య‌వంశీలో క‌నిపించిన గొప్ప ప‌రిణితి. ఉదాహ‌ర‌ణ‌కు ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో క‌మిన్స్ మొద‌లుకొని ఏ బౌల‌ర్‌ను వ‌ద‌ల‌ని సూర్య‌వంశీ 29 బంతుల్లోనే 97 ప‌రుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. 

ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ చేసి ఉంటే ప్ర‌పంచ రికార్డు త‌న ముంగిట ఉండేదేమో. ఇక గుజ‌రాత్ టైటాన్స్‌తో క్వాలిఫ‌య‌ర్‌-2లో వైభ‌వ్ ఆడిన ఇన్నింగ్స్ కూడా అద్భుత‌మ‌నే చెప్పొచ్చు. జ‌ట్టు క‌ష్టాల్లో ప‌డింద‌న్న విష‌యాన్ని గుర్తించిన వైభ‌వ్ త‌న శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేసిన‌ప్పటికీ మెరుపుల‌కు లోటు లేకుండా చూసుకున్నాడు. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ఫోర్లు, సిక్స‌ర్లు బాదాడు. 

వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ శ‌త‌కం చేజార్చుకున్న వైభ‌వ్ ఈ సీజ‌న్‌లో మొత్తం 72 సిక్స‌ర్లు బాది ఒకే సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన క్రికెట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఇలా సీజ‌న్ ఆద్యంతం త‌న ఆట‌తీరుతో అల‌రించిన వైభ‌వ్ సూర్య‌వంశీకి ఐపీఎల్ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

‘ఐపీఎల్ ద్వారా నీ అద్భుత బ్యాటింగ్ విన్యాసాల‌ను మాకు చూపించినందుకు థ్యాంక్స్’ అని చెబుతూ పోస్టుల‌తో నింపేశారు. ‘15 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఒక జ‌ట్టును త‌న భుజ‌స్కందాల‌పై మోసుకెళ్లిన తీరు అద్భుతం. ఐపీఎల్ ట్రోఫీలు వ‌స్తుంటాయి.. పోతుంటాయి.. కానీ నీ ప్ర‌ద‌ర్శ‌న మాత్రం ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది వైభ‌వ్‌’ అని ఒక అభిమాని వైభ‌వ్‌కు సంబంధించిన ఒక వీడియోనూ పంచుకోవడం హైలైట్‌గా నిలిచింది.

చదవండి: IPL 2026: ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement