IPL 2026: ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి షాక్‌! | Ban Imposed On RCB Fans Not Celebrate Hours Before IPL 2026 Final | Sakshi
Sakshi News home page

IPL 2026: ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి షాక్‌!

May 30 2026 12:50 PM | Updated on May 30 2026 1:26 PM

Ban Imposed On RCB Fans Not Celebrate Hours Before IPL 2026 Final

ఐపీఎల్ 2026 సీజ‌న్ విజేత ఎవ‌ర‌నేది మ‌రొక రోజులో తేలిపోనుంది. ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ), గుజ‌రాత్ టైటాన్స్ త‌ల‌ప‌డనున్నాయి. వ‌రుస‌గా రెండోసారి క‌ప్పు కొట్టాల‌నే ఉత్సాహంతో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఒక వార్త నిరాశ క‌లిగిస్తోంది.  

బెంగ‌ళూరు సిటీలో క‌ఠిన ఆంక్ష‌లు విధించ‌డంతో పాటు 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంటుంద‌ని న‌గ‌ర పోలీస్ శాఖ శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఒక‌వేళ ఆర్సీబీ గ‌నుక రెండో టైటిల్ గెలిస్తే నగ‌రమంతటా భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు గూమిగూడ‌తార‌నే అంచ‌నాల నేప‌థ్యంలో ముందస్తు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు బెంగ‌ళూరు పోలీస్ క‌మిష‌నరేట్ కార్యాలయం పేర్కొంది.

2025 సీజ‌న్ విజేత‌గా నిలిచిన ఆర్సీబీ విజ‌యోత్స‌వాలను బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విజ‌యోత్స‌వం తొక్కిస‌లాట‌కు దారి తీసి 11 మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. దీంతో ఈసారి అలా జ‌ర‌గ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే ముంద‌స్తు చ‌ర్య‌ల కింద బెంగ‌ళూరు సిటీ మొత్తం క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తూ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు.

కఠిన ఆంక్ష‌లు ఇవే..
👉ముంద‌స్తు అనుమ‌తి లేకుండా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయ‌రాద‌ని తెలిపారు. సంబంధిత శాఖ‌ల నుంచి ఆమోదం పొందితే త‌ప్ప బ‌హిరంగ ప్ర‌దేశాల్లో బిగ్ స్క్రీన్‌లు ఏర్పాటు చేయ‌కూడ‌దు.
👉ఇక ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన‌ అనంత‌రం రోడ్లు, పార్కులు, బ‌హిరంగ ప్ర‌దేశాల్లో సాముహిక విజ‌యోత్స‌వ‌ సంబ‌రాలు చేసుకోకూడ‌దు.
👉ముఖ్యంగా జ‌నం పెద్ద ఎత్తున గూమికూడి విజ‌యోత్స‌వాల పేరుతో బైక్ ర్యాలీలు, రోడ్లు బ్లాక్ చేస్తూ సంబ‌రాలు చేసుకోవ‌డం పూర్తిగా నిషేధం.
👉ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రోడ్ల‌పై ట‌పాసులు కాల్చ‌డం లేదా ఇత‌ర కార్య‌క్రమాలు చేప‌ట్ట‌డం చేయ‌వ‌ద్ద‌ని సూచించారు.

విషాదంలా విజ‌యోత్స‌వాలు..
2025 ఐపీఎల్‌లో చాంపియ‌న్‌గా నిలిచిన ఆర్సీబీ విజ‌యోత్స‌వం నిర్వ‌హించింది. ఈ విజ‌యోత్స‌వం కాస్తా విషాదంగా మారిపోయింది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన విజ‌యోత్స‌వాల‌కు జ‌నాలు భారీగా త‌ర‌లివ‌చ్చారు. స్టేడియం నిండిపోవ‌డంతో బ‌య‌ట కూడా సుమారు 2 నుంచి 3 ల‌క్ష‌ల మంది అభిమానులు గూమిగూడారు. 

భారీ జ‌న‌స‌మూహం కార‌ణంగా జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 11 మంది మ‌ర‌ణించ‌గా, 50 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. మ‌ళ్లీ ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకూడ‌ద‌నే ఉద్దేశంతోనే ముంద‌స్తు చ‌ర్య‌ల కింద క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు బెంగ‌ళూరు పోలీస్ క‌మిష‌నరేట్ తెలిపింది.

గుజ‌రాత్ వ‌ర్సెస్ ఆర్సీబీ..
రెండు నెల‌ల పాటు సాగిన ఐపీఎల్ 2026 సీజ‌న్ చివ‌రి అంకానికి చేరుకుంది. రేపు జ‌ర‌గ‌బోయే ఫైన‌ల్లో ఆర్సీబీ, గుజ‌రాత్ టైటాన్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. సీజ‌న్ ఆరంభం నుంచి ఆర్సీబీ నిల‌క‌డ‌గా ఆడుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే 18 పాయింట్ల‌తో టేబుల్ టాప‌ర్‌గా నిలిచి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. 

మ‌రోవైపు గుజ‌రాత్ కూడా స్థిర‌మైన ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగించిన‌ప్ప‌టికీ మ‌ధ్య‌లో కొన్ని అప‌జ‌యాలు ప‌ల‌కరించాయి. కానీ అన్నీ దాటుకొని ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన గుజ‌రాత్‌కు క్వాలిఫ‌య‌ర్‌-1 పోరులో ఆర్సీబీ షాక్ ఇచ్చింది. అయితే క్వాలిఫ‌య‌ర్‌-2 పోరులో మాత్రం రాజస్తాన్‌ను చిత్తు చేసిన గుజ‌రాత్ టైటాన్స్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. 

చదవండి: వైభ‌వ్‌కు క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్‌.. కోహ్లీకి పోటీగా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement